
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
పెద్దమండ్యం : పోక్సో కేసులో యువకుడిని శనివారం అరెస్టు చేసినట్లు ములకలచెరువు సీఐ లక్ష్మన్న తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెలిగల్లు గ్రామం గురికివాండ్లపల్లెకు చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఈ నెల 6వ తేదీన ఇంటి వద్ద బాలిక ఉండగా గాలివీడుకు చెందిన మల్లెల రామక్రిష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెలిగల్లు సచివాలయం వద్ద ఉండగా నిందితుడిని అరెస్ట్ చేసి తిరుపతి జువైనల్ కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు.
నీటి కుంటలో పడి వ్యక్తి మృతి
కురబలకోట : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..తెట్టు గ్రామం మండ్యం వారిపల్లె వద్ద ఇటుకల బట్టీలో మదనపల్లెకు చెందిన అలీ (42) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతను సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతి చెంది ఉండగా స్థానికులు కనుగొన్నారు. ఇతనికి వాయువు కన్పిస్తుంది. ఆరోగ్యం కూడా బాగాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.