అమూల్‌ డెయిరీ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ బోర్డులు | - | Sakshi
Sakshi News home page

అమూల్‌ డెయిరీ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ బోర్డులు

Jul 18 2025 5:32 AM | Updated on Jul 18 2025 5:32 AM

అమూల్‌ డెయిరీ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ బోర్డులు

అమూల్‌ డెయిరీ స్థలంలో రియల్‌ ఎస్టేట్‌ బోర్డులు

మదనపల్లె రూరల్‌ : కడప–బెంగళూరు హైవేలోని మదనపల్లె అమూల్‌ డెయిరీ స్థలంలో ఓ రియల్టర్‌ తన వెంచర్‌కు సంబంధించిన బోర్డులు శాశ్వతంగా ఏర్పాటుచేశాడు. ప్రభుత్వ డెయిరీకి చెందిన స్థలంలో ప్రైవేట్‌ వ్యక్తులు రియల్‌ఎస్టేట్‌ బోర్డులు ఏర్పాటుచేయడంపై సిబ్బంది తహసీల్దారు కిషోర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రోడ్డుపై వెళుతున్న వారు అమూల్‌ డెయిరీని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు అమ్మి వేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బెంగళూరు ప్రధాన రహదారికి ఆనుకుని నక్కలదిన్నె సమీపంలోని సర్వే నెం.42/1బీ, 43/1బీలో నాలుగెకరాల భూమిని 1977లో కేంద్ర ప్రభుత్వం డెయిరీ స్కీమ్‌లో భాగంగా స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు పత్రాల్లో డెయిరీ సరిహద్దుల్లో ఉత్తరం వైపు మదనపల్లె–బెంగళూరు రోడ్డు, తూర్పున ఎద్దుల బండిబాట, మిగిలిన రెండు పక్కల తుమ్మలకాలువగా పేర్కొన్నారు. స్థలం కొనుగోలు చేసిన నాటి నుంచి నేటి వరకూ ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలోనే ఉంది. ప్రస్తుతం అమూల్‌ డెయిరీకి లీజు ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. డెయిరీకి ఆనుకుని పక్కన ఉన్న పొలాలను రైతుల నుంచి బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్‌ కొనుగోలు చేశారు కేకే న్యూ సిటీ పేరుతో వెంచర్‌ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో జిల్లాకు చెందిన ఓ మంత్రికి, స్థానికంగా కొందరు టీడీపీ నాయకులకు వాటాలు ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన మొదట్లో స్థానిక రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడం, కోర్టు కేసులతో కొన్నాళ్లు పనులు నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పనులు వేగంగా జరగడం, వెంచర్‌కు సంబంధించిన పెద్ద హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, సైన్‌ బోర్డులు...మెయిన్‌ ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేయడమే కాకుండా, పక్కనే ఉన్నటువంటి అమూల్‌ డెయిరీకి చెందిన స్థలంలోనూ హైవే రహదారికి ఆనుకుని, భూమిలో డ్రిల్లింగ్‌ చేసి మరీ శాశ్వత ప్రాతిపదికన మెస్‌ బోర్డులు ఏర్పాటుచేశారు. దీనిపై డెయిరీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో వారు చేసేదిలేక, తమ స్థలాన్ని కాపాడాల్సిందిగా మండల తహసీల్దార్‌ కిషోర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదుచేయడంతో పాటు ఏపీ డెయిరీ ఎండీకి లేఖ రాశారు. జిల్లా కలెక్టర్‌ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అమూల్‌ డెయిరీ స్థలంలో హోర్డింగ్‌లు ఏర్పాటుచేసుకున్న రియల్టర్‌, అంతటితో ఆగకుండా ఏకంగా డెయిరీ కాంపౌండ్‌కు ఆనుకుని ప్రతినెలా డెయిరీకి అద్దె చెల్లిస్తున్న క్యాంటీన్‌ను ఖాళీ చేయాలని, స్థలం తమదేనని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే...భవిష్యత్తులో డెయిరీని రియల్టర్‌ తమ వెంచర్‌లోదేనని చెప్పి అమ్మేస్తాడంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న

రెవెన్యూ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement