
రోగులతో స్నేహంగా మెలగాలి
కురబలకోట: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా, స్నేహంగా మెలగాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం కురబలకోట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, మందుల పరిస్థితి, సిబ్బంది కొరత, ఓపీ వివరాలు, రక్త పరీక్షలు, సిబ్బంది పనితీరు తదితర వాటిపై డాక్టర్ చక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలిగారా లేదా వంటి అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పీహెచ్‌సీలు పనిచేయాలన్నారు. 15 రోజులకోసారి తహసీల్దార్, ఎంపీడీఓ పీహెచ్‌సీలను తనిఖీ చేయాలన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన కురబలకోటలోని సంపద సృష్టి (డంపింగ్ యార్డు) కేంద్రాన్ని పరిశీంచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ధనుంజయలు, ఎంపీడీఓ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.
నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ
పార్కుల ఏర్పాటుకు చర్యలు
రాయచోటి: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పి–4 పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్, ఎంఎస్‌ఎంఈ పార్కులు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి–4 కార్యక్రమంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకాలతో మ్యాప్ చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శలతో మ్యాప్ చేసే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఆరు ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూమి అవసరమైన నియోజకవర్గాల్లో భూమి కేటాయింపు జరగాలని తెలిపారు. ప్రపంచ బ్యాంకు చేయూతతో నిర్వహిస్తున్న ర్యాంప్ ప్రాజెక్టులో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల మూడో శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్‌ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సేవా దృక్పథంతోవిధులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్