
పడిగాపులు
రాయచోటి టౌన్: ఆఫీసర్ ఎవరైనా బదిలీపై వెళితే.. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారి బాధ్యతలు అప్పగిస్తారు. ఇది సాధారణం...అది ఏ శాఖ అయినా జరిగేది ఇదే...అదేమి విచిత్రమో.. ఈ ప్రభుత్వంలో బదిలీపై వచ్చిన అధికారి కార్యాలయానికి వచ్చినా చార్జి అప్పగించేవారు లేక పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇదంతా ఎక్కడో జరగలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో చోటు చేసుకొంది. శ్రీకాళహస్తి ఆలయ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న కస్తూరి రాయచోటి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో బాధ్యతలు చేపట్టేందుకు గురువారం వచ్చారు. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవో రమణారెడ్డి ఆలయంలో లేకపోవడంతో ఆయన రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈమె గతంలో దేవుడి కడప, బోయకొండమ్మ, కాణిపాక ఆలయాల్లో పని చేశారు. ఇప్పుడు రాయచోటి శ్రీ వీరభధ్రస్వామి ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో వచ్చారు. బాధ్యతలు అప్పగించాల్సిన అధికారి లేకపోవడంతో ఎక్కడికి పోవాలో తెలియక, ఏమీ చేయాలో దిక్కుతోచక ఆలయంలో నిరీక్షిస్తూ ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.