
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
సిద్దవటం : ప్రభుత్వ ఉద్యోగిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తిని నష్టం కలిగించిన కేసులో రాజోలి మల్లికార్జున, ఆయన తల్లి రాజోలి రత్నమ్మలకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ. 1000 జరిమానా విధిస్తూ బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ బుధవారం తీర్పు వెలువరించినట్లు సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ మాట్లాడుతూ సిద్దవటం కోర్టు జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న గుమ్మల్ల రామక్రిష్ణారెడ్డి సిద్దవటం జడ్జి జిల్లా జడ్జి కాన్ఫరెన్స్‌కు వెళ్లారు. 2018 డిశంబర్, 29న ముద్దాయిలు అయిన మల్లికార్జున ఆయన తల్లి రాజోలి రత్నమ్మలను పిలిచి జడ్జి కడపకు వెళ్లడంతో కేసు వాయిదా వేస్తున్నామని రికార్డ్ అసిస్టెంట్, తదితరులు చెప్పారన్నారు. దీంతో కోర్టు హాలులోనే గట్టిగా కేకలు వేసి కోర్టు మర్యాదకు భంగం కలిగించేలా మల్లికార్జున, రత్నమ్మ ప్రవర్తించారని, కోర్టు కానిస్టేబుల్ అడ్డు రాగా కాలర్ పట్టుకొని పిడిగుద్దులు గుద్దారని తెలిపారు. కానిస్టేబుల్‌ను గాయపరచడమేగాక, సిబ్బందిని బూతులు తిట్టి కోర్టులో కుర్చీలు, బల్లలను పగుల కొట్టడం జరిగిందన్నారు. అప్పటి సిద్దవటం ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేశారన్నారు. నేరం రుజువు కావడంతో నిందితులు ఇద్దరికీ శిక్ష విధించారన్నారు. సాక్షాధారులను సకాలంలో ప్రవేశపెట్టి నేరం ఋజువు చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈజి అశోక్‌కుమార్ అభినందించినట్లు ఎస్‌ఐ తెలిపారు.