
అధికారులకు ప్రొటోకాల్ పట్టదా !
మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను జిల్లా అధికారులు తీవ్రంగా అవమానించారు. ప్రొటోకాల్ నిబంధనలను పాటించాల్సిన అధికారులు.. వాటిని పక్కనపెట్టి ప్రజాప్రతినిధి కాని వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రికి గౌరవం లేకుండా చేశారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగి, వాటికి ప్రారంభోత్సవం చేస్తే జిల్లా అధికారులు ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకాల్లో పేర్లు అచ్చు వేయిస్తారు. అయితే సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమాలకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి హాజరై ప్రారంభోత్సవాలు చేశారు.
ప్రొటోకాల్ ఉల్లంఘించి..
బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో సిమెంటు రోడ్లు, సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం తదితర వాటికి ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవాల కోసం శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులో అన్నింటిపైన ప్రారంభకులుగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి పేర్లు పెట్టారు. మూడో పేరుగా డి.జయచంద్రారెడ్డి, ఇన్‌చార్జ్, తంబళ్లపల్లె నియోజకవర్గం అని పేరు పెట్టారు. ఇతను గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ప్రొటోకాల్ పదవిలో లేరు. కనీసం ఎందులోనూ ప్రజాప్రతినిధి కారు. అయినప్పటికీ జిల్లా అధికారులు ప్రొటోకాల్ నిబంధనను పక్కనపెట్టి మూడో పేరుగా వేయించారు. అందులోనూ జయచంద్రారెడ్టి నిలువెత్తు ఫొటోను అన్ని శిలాఫలకాల్లోనూ వేయించారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో ఈ పేరు వేయకూడదన్న విషయం తెలిసినా.. వేసిన అధికారులు మరో తీవ్రమైన తప్పు చేశారు. ఈ పేరుకింద ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పేరు పెట్టారు. అంటే అధికారులకు ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంతటి గౌరవం ఇచ్చారో, ఏ మేరకు గుర్తించారో స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని శిలాఫలకాల్లో ఇలా చేయగా.. కొన్నింటిలో ఉపముఖ్యమంత్రి పేరుకింద మంత్రి లోకేష్ పేరు పెట్టారు. అసలు ప్రజాప్రతినిధి కాని జయచంద్రారెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రారంభకులు ఎలా అవుతారో.. ప్రొటోకాల్ నిబంధనలు పాటించాల్సిన జిల్లా అధికారులకు తెలియదా అన్నది చర్చనీయాంశమైంది. ప్రారంభకులు ఎవరైనా దాని కింద ప్రాధాన్యతగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి పేర్లు పెట్టాలి. దీన్ని కూడా విస్మరించారు. ఈ శిలాఫలకాలను ప్రారంభించిన మంత్రి జనార్దన్‌రెడ్డి దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే పర్యటన ముగించుకుని వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే, ఎంపీ అతిథులా
నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా, ప్రారంభించినా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి మొదటి ప్రాధాన్యత దక్కాలి. వీటికి వీళ్లను కచ్చితంగా అధికారులు ఆహ్వానించి వారి ద్వారానే అమలు చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల విషయంలో జాగ్రత్త అవసరం. అయితే తంబళ్లపల్లె నయోజకవర్గంలో ఇష్టారీతిన ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులను జిల్లా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనితో తమకేమికాదులే అన్న నిర్లక్ష్యంతో స్థానిక అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిఫలితమే సోమవారం బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. ఈ ప్రారంభోత్సవాలకు మంత్రులు, ఆపై ప్రభుత్వ స్థాయిలో ఉన్న వారితో ప్రారంభోత్సవాలు చేయించొచ్చు. అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రారంభోత్సకుల్లో ఉంటారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ శిలాఫలకాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి అతిథులట. స్థానిక ప్రజాప్రతినిధులు అతిథులు ఎలా అవుతారో కనీసం శిలాఫలం వేసే సమయంలో అధికారులు దీనిపై ఎందుకు పట్టించుకోలేదో వారికే తెలియాలి. వారి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలను వారినే.. అతిథులు చేసిన అధికారులు రెడ్‌బుక్ రాజ్యంగం మేరకు కొత్త ప్రొటోకాల్ నిబంధనలు అమలు చేస్తున్నట్టుంది. టీడీపీ నాయకుడి నిలువెత్తు ఫొటో వేసిన అధికారులు ఎమ్మెల్యే, ఎంపీల ఫొటోలను ఎక్కడా వేయలేదు. దీన్నిబట్టి చూస్తే అధికారులు ప్రొటోకాల్‌తో తమకేం పని, అంతా మా ఇష్టం అన్నట్టుగా ఉంది వారి వ్యవహారశైలి. ఏడాదిగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు పాటించడం లేదు. దీనికి జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకోవడం లేదనా లేక అధికార పార్టీ నేతల మద్దతు ఉందనా? దీనిపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారు, దీనికి ఎవరు బాధ్యులు అవుతారు, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఎమ్మెల్యే ఆదర్శం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలోని గుట్టపాళ్యంలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హాజరయ్యారు. ప్రారంభానికి ముందు శిలాఫలకం చూసి ప్రోటోకాల్ మేరకు ఉండాల్సిన పేర్లు లేవంటూ ఆవిష్కరించలేదు. ప్రొటోకాల్ విషయంలో ఇలా వ్యవహరించాలి.
తంబళ్లపల్లెలో ఉప ముఖ్యమంత్రికి
తీవ్ర అవమానం
శిలాఫలకాల్లో ప్రజాప్రతినిధి కాని
వ్యక్తి పేరు కింద పవన్ పేరు
అభ్యంతరం చెప్పకుండా ప్రారంభించిన మంత్రి జనార్దన్‌రెడ్డి
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అతిథులా..?

అధికారులకు ప్రొటోకాల్ పట్టదా !