
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదంలో, భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం రామాపురానికి చెందిన చిన్న వెంకటరమణ కుమారుడు చౌడప్ప (30)కు బి కొత్తకోట మండలం చవటకుంటకు చెందిన కనకలక్ష్మితో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి దేవాన్ష్ కుమారుడు ఉన్నాడు. చౌడప్ప భార్య కుమారుడితో కలిసి బీ కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికల తోపు వద్ద ఉంటూ, స్థానికంగా వాటర్ క్యాన్ల వాహనానికి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. అంతేకాకుండా మరో మహిళతో చాటింగ్ చేస్తూ, ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పంపుతుండడంతో, భార్య కనకలక్ష్మి తరచూ గొడవపడేది. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కనకలక్ష్మి భర్తను తీవ్రంగా మందలించింది. అనంతరం ఆమె రోజువారి కూలీ పనులకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన చౌడప్ప పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న భార్య స్థానికుల సాయంతో బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించింది. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చౌడప్ప మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న ఔట్ పోస్ట్ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.