
అడవి జంతువులను వేటాడిన వ్యక్తి అరెస్ట్
సిద్దవటం : సిద్దవటం రేంజి పరిధి అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామ సమీపం లోని పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యంలో అడవి జంతువులను వేటాడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో రేంజర్ కళావతి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యంలో కూంబింగ్ నిర్వహించారు. అక్కడ అడవి జంతువు అయిన కొండ గొర్రెను ముగ్గురు వ్యక్తులు నాటు తుపాకీతో వేటాడి చంపి మాంసాన్ని పెద్ద మొత్తంలో విక్రయించడానికి పక్కన పెట్టి, కొంత మాంసాన్ని అడవిలో వండుకొని తింటుండగా వెళ్లి దాడులు చేశారు. గోపవరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బుడమకుంట రమణయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. వారిలో అట్లూరు మండలం చలంగారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మల వెంకటసుబ్బయ్య, గుమ్మల శ్రీను ఉన్నారని రేంజర్ తెలిపారు. వారి కోసం తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. రమణయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ ఆపరేషన్‌లో ఆరు అడవి జంతువుల కాళ్లు (కొండ గొర్రెలు), వండిన మాంసం, కత్తులు, టార్చిలైట్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేస్, బీటు అధికారులు, అసిస్టెంటు బీటు అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.