
ఘనంగా చక్ర, త్రిశూల స్నానం
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్నమాచార్య ధాన్యమందిరం ఆవరణంలోని కళ్యాణవేదికపై శ్రీ సిద్దేశ్వరస్వామికి త్రిశూలస్నానం, శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు అభిషేకాలు , ప్రత్యేకపూజలు జరిపారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అంతకముందు వసంతోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు.
తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం
రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం బయటపడింది. అదే విధంగా పురాతనమైన రోలు వెలుగుచూసింది. దీంతో గ్రామస్తులు, రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతడాలుగా తాళ్లపాక చెరువు వద్దకు చేరుకున్నారు. శివలింగానికి అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం స్వామి పూజలు నిర్వహించారు. తాళ్లపాక చెరువులో వెలుగులోకి వచ్చిన పురానత శివలింగంపై బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్‌నాయుడు, రిటైర్డ్ పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇక్కడతవ్వకాలు చేపడితే చరిత్ర బయపడుతుందన్నారు. తాళ్లపాక చెరువు అభివృద్ధిలో భాగంగా శివాలయం కూడా నిర్మితం చేసే విధంగా టీటీడీ యోచించాలన్నారు.

ఘనంగా చక్ర, త్రిశూల స్నానం