
బాధ్యతగా సమస్యలను పరిష్కరించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం జేసి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదు పరిష్కారంపై నేరుగా పర్యవేక్షిస్తోందని జేసీ తెలిపారు. అధికారులు ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న బియాండ్ ఎస్‌ఎల్‌ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు.
వినతులు..
వాల్మీకిపురం మండలానికి చెందిన అంజప్ప తన కుడికాలును అనారోగ్య కారణాల రీత్యా పూర్తిగా తీసివేశారని, తనకు త్రిచక్ర వాహనాన్ని ఇప్పించాలని జేసీకి విన్నవించుకున్నారు. నందలూరు మండలానికి చెందిన సాంబశివ నాయుడు తన కుమార్తెకు వివాహమైందని,ఆమె పేరును తన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి వేరు చేయాలని విన్నవించుకున్నారు. రాయచోటిలో నివసిస్తున్న చాంద్‌బాషా తనకు 75 సంవత్సరాల వయస్సు అని, ఎటువంటి పని చేయలేని పరిస్థితులలో ఉన్నానని, వృద్దాప్య పింఛన్ ఇప్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్‌కు వినతి చేసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్‌ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.