
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహ వచనం, కుంకుమపూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్యపూజ, మాంగల్యధారణ, అక్షతరూపణ, మాలమార్పిడి, వారణమయి మహానివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టీటీడీ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, ఒంటిమిట్ట మండల ప్రత్యేక అధికారి బ్రహ్మయ్య, ఒంటిమిట్ట ఇన్‌చార్జి ఎంపీపీ లక్ష్మీదేవి దంపతులు, అర్చకులు, టీటీడీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.