
ధర్మప్రచారంలో అధర్మం !
రాజంపేట : తిరుమల తిరుపతిదేవస్ధానం ధర్మప్రచారపరిషత్(డీపీపీ) ధార్మిక ప్రచారం కోసం కృషిచేయాలి. అయితే ఇటీవల ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదని విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణ డొల్లగా ఉందనే భావన ఉంది. ధర్మప్రచారపరిషత్ ముసుగులో ఆదాయ వనరులను అన్వేషించుకుంటున్నారు. పరోక్షంగా శ్రీవారి సొమ్ముకు ఎసరు పెడుతున్నారనే అపవాదును మూటకట్టుకుంది. డీపీపీ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలున్నాయి. హిందూధర్మాని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన డీపీపీ పక్కదారిలో నడుస్తోందన్న అపవాదు ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలలో చర్చనీయాంశంగా మారింది.
టీటీడీ ఆధీనంలో..
జిల్లాలో టీటీడీ ఆధీనంలో ఉన్న ఒంటిమిట్ట, నందలూరు, తాళ్లపాకతోపాటు ఇతర ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు, భజనలు లాంటివి ధర్మప్రచారపరిషత్ కనుసన్నల్లో జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. ఇందులో భక్తులతో పాటు స్ధానిక కళాకారులు కూడా పాల్గొనే పరిస్థితులు ఉండవన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు నందలూరులోని సౌమ్యనాథాలయం, తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర ఆలయం, శ్రీ చెన్నకేశవ ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడి కార్యక్రమాలు ధర్మప్రచారపరిషత్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ధార్మిక ఉపన్యాసాలు, కోలాటలు, చెక్కభజనలు తదితర అధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.ఇందులో జిల్లాకు సంబంధించి కళాకారులు, భాగవతులకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారి కార్యక్రమాలల్లో కనిపించరు. అంతా తిరుపతి నుంచి నడిపిస్తుంటారు.ఽ ఒంటిమిట్టలో జరిగే కార్యక్రమానికి గుండుసూది ప్యాకెట్ తిరుపతి నుంచి తెచ్చినట్లుగా బిల్లులు పెట్టుకోవడం గమనార్హం. ధర్మప్రచారపరిషత్ కార్యక్రమాల్లో నిర్వహణ లోపాయికారిగా జరుగుతోందని, ఉన్నవారితోనే సైక్లింగ్ చేస్తూ, కొత్తవారు, స్థానికులను తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి.
● లక్షలాది రూపాయల జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ధార్మిక జీవనం చేస్తున్న వారిని ధర్మప్రచారపరిషత్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే వ్యక్తి మూడుచోట్ల ధార్మికపనోస్యాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కొంతమందిని ధర్మప్రచారపరిషత్ పెట్టుకొని నడిపిస్తోంది. రెండేళ్లలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది.
స్ధానికేతరులతో..
జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు స్థానికేతర కళాకారులను తీసుకొచ్చి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియడంలేదని స్థానిక కళాకారులు వాపోతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని జిల్లాకు చెందిన భాగవతులు, కళాకారులు డీపీపీ అధికారులను కోరినా తిరుపతికి జిల్లాకు చెందిన ప్యానల్ సభ్యులు ఉన్నారని చెప్పారని కొందరు పెదవి విరుస్తున్నారు. తిరుపతితోపాటు ఇతర ప్రాంతాల నుంచి లోపాయికారి ఒప్పందాలతో జిల్లాలోని ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు స్థానికేతరులను తీసుకొస్తున్నారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ జరుగుతుంటోంది.
కొరవడిన పర్యవేక్షణ
ధర్మప్రచారపరిషత్ నిర్వహణకు సంబంధించి సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్లే శ్రీవారి సొమ్ము పక్క దోవ పడుతోందని, కొందరి ఉద్యోగుల జేబుల్లోకి వెళుతోందని ఆరోపణలు వెలువడుతున్నాయి.టీటీడీ విజిలెన్స్ విభాగం రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని అధ్యాత్మికవేత్తలు, స్థానిక కళాకారులు చెబుతున్నారు.
● ధర్మప్రచారపరిషత్ కార్యక్రమాలను స్థానికంగా ప్రచారం చేసేందుకు కరపత్రాలు ముద్రించి , గ్రామాల్లో పంపిణీ చేయాలి. ఽప్రతి ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ధార్మికోపన్యాసాలు, అధ్మాతిక ప్రవచనాలు, భజనలకు గురించి ప్రచారం కొరవడింది. కరపత్రాలను ముద్రించి ప్రచారం చేసినట్లుగా లెక్కలు చూపుతుండటం గమనార్హం.
ప్రోగ్రాం అసిస్టెంట్ ఎమంటున్నారంటే..
ధర్మ ప్రచారపరిషత్ కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని డీపీపీ కడప, అన్నమయ్య జిల్లాల ప్రొగ్రాం అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు. డీపీపీ తనదైన రీతిలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతోందని, వస్తున్న ఆరోపణలు అవాస్తమని పేర్కొన్నారు. స్థానికంగా చాలామంది కళాకారులను అడిగామని, వారు రాకపోవడానికి అనేక కారణాలు చెప్పారని వివరించారు.
రంగంలోకి స్థానికేతర కళాకారులు
లోపాయికారి ఒప్పందాలతో ప్రోగ్రాంల నిర్వహణ
నీరుగాతున్న డీపీపీ లక్ష్యం