
తాళ్లపాకను సందర్శించిన టీటీడీ అధికారులు
తాళ్లపాక(రాజంపేట) : పదకవితాపితామహుడు అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకను టీటీడీ అధికారులు శనివారం సందర్శించారు. తాళ్లపాకను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ముందుగా టీటీడీ అధికారులు విలేజ్ విజిట్ నిర్వహించారు.టీటీడీ ఇంజినీరింగ్ ఎస్‌ఈ మనోహర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నాగరాజు,నీటిపారుదలశాఖ ఎస్‌ఈ వెంకట్రామయ్యతో పాటు ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌కు చెందిన అధికారులు ఉన్నారు. కాగా ఈనెల7న టీటీడీ ఈవో శ్యామలరావును, బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు కలిసి తాళ్లపాక అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై వినతులు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన అధికారులు తాళ్లపాక రోడ్డును పరిశీలించారు. తాళ్లపాకు చెరువు కట్టపై ఉన్న రోడ్డుపై కవుల విగ్రహాలను ట్యాంక్‌బండ్ తరహాలో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. తాళ్లపాక చెరువులో శివలింగాన్ని, అన్నమయ్య పదకవితలు రాస్తున్నట్లుగా విగ్రహం ఏర్పాటుకు, చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు అంచనాలు రూపొందించారు. ధ్యానమందిరం, నూతన కల్యాణమండపం పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు. మరుగుదొడ్లు తొలగించి, వేరే ప్రదేశంలో నిర్మించాలన్నారు. ఈ ప్రతిపాదనలకు ఎస్టిమేట్లు వేసేందుకు టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. బీజెపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు, కార్యవర్గసభ్యుడు పోతుగుంట రమేష్‌నాయుడు, మాజీ సర్పంచ్ తనయుడు ఉద్దండం సుబ్రమణ్యం, గ్రామస్తులు జువ్వాది మోహనరావు, సుదర్శన్, తాళ్లపాక ఆలయాల ఇన్‌స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు.