
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ చెన్నకేశవస్వామికి శనివారం రాత్రి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. రథం వేదికపై ఆసీనులు చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే ఉదయం శ్రీ సిద్దేశ్వరస్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. కాగా ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి పార్వేటి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ చెన్నకేశవస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఇన్‌స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
పిచ్చి కుక్క దాడిలో
ముగ్గురికి గాయాలు
సిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటం ఎగువపేటలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ముగ్గురికి కాటు వేసింది. ఎగువపేట మఠంవీధిలో శనివారం సాయంత్రం తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కరిచింది. అలాగే పోలీసు లైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడిని, మెయిన్ బజారులో తేజా అనే యువకుడిని కూడా కరిచింది. కుక్క కాటుకు గురైన వారు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్, ఇంజక్షన్ వేయించుకున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి పిచ్చి కుక్కను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు.