
అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం
మదనపల్లె రూరల్ : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని వైఎస్సార్ సీపీ అన్నమయ్యజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లెలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల మేలు కలిగిందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలన్నింటినీ అమలుచేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ఒత్తిడితో అరకొరగా తల్లికి వందనం అమలు చేశారన్నారు. మేనిఫెస్టో హామీల గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. ప్రతి గడపకు వెళ్లి జగన్, చంద్రబాబు మధ్య తేడా వివరించాలని సూచించారు. చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్.దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ..జగనన్న హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులు వచ్చేవన్నారు. చంద్రబాబు పాలనలో అవి లేకపోగా, ఆయన చేసిన మోసాలు ఒకొక్కటే ప్రజలకు తెలిసి వస్తున్నాయన్నారు.రాబోయే మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువద్దామన్నారు. అనంతరం కడప మేయర్ సురేష్‌బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అనీషారెడ్డి మాట్లాడారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పోస్టర్, క్యూఆర్ కోడ్‌లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనూజారెడ్డి, షమీం అస్లాం, జెడ్పీటీసీలు ఉదయ్‌కుమార్, సీహెచ్.రామచంద్రారెడ్డి, ఆర్‌ఐ.రమణారెడ్డి, వెలుగుచంద్ర, వెంకటరమణారెడ్డి, మండల కన్వీనర్ దండుకరుణాకర్‌రెడ్డి, కేశవరెడ్డి, కొమ్మేపల్లె శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్‌ఆజం, లియాఖత్‌అలీ, ఎస్.ఏ.కరీముల్లా, ఎన్‌ఆర్‌ఐ దండుశేఖర్‌రెడ్డి, శివప్రసాద్, హర్షవర్ధన్‌రెడ్డి, ఇర్ఫాన్, బి.రేవతి, మేరీ, శీలంరమేష్, మునిశేఖర్, బండపల్లి వెంకటరమణ, పోతబోలునాగరాజ, ఈశ్వరయ్య, శరత్‌రెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, ఆర్టీఏ నూర్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ అన్నమయ్యజిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి