
కమనీయం.. కల్యాణోత్సవం
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో శుక్రవారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కళ్యాణోత్సవాలను వేర్వేరుగా వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య ధాన్య మందిరం ఆవరణలోని కళ్యాణ వేదికపై ముందుగా సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువుదీర్చారు. ఒకే వేదికపై శివ, కేశవుల కళ్యాణం జరుగుతుండడంతో రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి హాజరైన వారికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది. సర్పంచి గౌరీ శంకర్, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్టదీపుడు, టీటీడీ అధికారులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం : బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం తితిదే ఏర్పాట్లు చేసింది.
మూడేళ్ల జైలు శిక్ష
రాయచోటి టౌన్: హత్యాయత్నం కేసులో షేక్.అజాజ్(అలియాస్ పాపా)కు రాయచోటి అదనపు జిల్లా సీనియర్ జడ్జి ప్రసూన మూడేళ్ల జైలుశిక్ష, రూ.10,000ల జరిమానా విధించినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. అర్బన్ సీఐ బివి.చలపతి కథనం మేరకు..05 జనవరి, 2022న రాయచోటి పట్టణంలోని రెడ్డిస్ కాలనీలో ( కుమ్మరమిట్ట) బేతల్ కాలనీ వద్ద షేక్. హమీద్ రహిమాన్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన షేక్.అజాజ్ (అలియాస్ పాపా)ను చాకుతో పొడిచాడు. అప్పటి ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. శుక్రవారం కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ప్రసూనా నిందితుడు నేరానికి పాల్పపడ్డాడని భావించి ఐపీసీ307 ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ.10,000లు జరిమానా కూడా విధించారని తెలిపారు.