చక్రాలమడుగు కబ్జాపై చర్యలు తీసుకుంటాం
జిల్లా కలెక్టరు శ్రీధర్ చామకూరి
రాజంపేట: రాజంపేట పట్టణ నడిబొడ్డున ఉన్న చక్రాలమడుగు కబ్జాపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. రాజంపేట సబ్‌కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. కోట్లాది రూపాయలు విలువ చేసే చక్రాలమడుగు కబ్జాల పర్వంపై మీడియా అడిగిన ప్రశ్నలపై ఆయన స్పందించారు. మడుగులో ఇప్పటికే 1500 నివాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఒకరి దగ్గర చర్య తీసుకోవడం మొదలు పెడితే ఎంత వరకు వెళుతుందో తెలియని పరిస్ధితి అన్నారు. ఉన్న ప్రాంతాన్ని కాపాడుకుంటూనే, మిగతా వాటి గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. చక్రాలమడుగులో ఉన్న నివాసాల వారికి ప్రత్యామ్నాయ కేటాయింపులపై ఆలోచించాలన్నారు. ఇప్పుడు నిర్మితమవుతున్న కట్టడాలపై ఫైల్ రన్ అవుతోందన్నారు. ఈ విషయంపై రాజంపేట సబ్ కలెక్టర్ వైకోమానైదియాదేవి దృష్టి సారించారని వివరించారు. చక్రాలమడుగు కబ్జాలతో కుచించుకుపోయిందని, వరదలు సంభవిస్తే రాజంపేట పట్టణం మునిగిపోతుందని కలెక్టర్ ఎదుట స్థానికులు వాపోయారు. మడుగు కబ్జాలకు అడ్డుకట్ట వేయాలని విన్నవించారు.
రాజంపేటలో రెవెన్యూ రికార్డులపై..
రాయచోటి తరహాలోనే రాజంపేట తహసీల్దారు కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు బయటి వారి చేతిలో ఉన్నాయనే ఆరోపణలు మీడియా సమావేశంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాయచోటి తరహాలోనే ఇక్కడ కూడా మాజీ రెవెన్యూ సిబ్బంది, రెవెన్యూ దళారుల ఇళ్లలో తనిఖీలు చేస్తే రాయచోటి తరహాలో రెవెన్యూ స్కాం వెలుగులోకి వస్తుందన్నారు. ఆధారాలు చూపిస్తే తనిఖీలు చేస్తామన్నారు. తమ వంతుగా ఆ దిశగా దృష్టి సారిస్తామన్నారు. రాయచోటిలో చోటుచేసుకున్న రికార్డులు, ఫేక్ పట్టాలు తదితర వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.


