జిల్లా కేంద్రం సమగ్రాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నియోజకవర్గం సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌లో రూ.10 వేల కోట్లు కేటాయించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా ఏర్పడి 4 సంవత్సరాలు అవుతున్నా ఇంత వరకు అభివృద్ధి ఏమీ జరగలేదన్నారు. రాయచోటి నియోజకవర్గం మీదుగా వెళ్లే కడప–బెంగళూరు రైల్వేలైన్‌కు అలైన్‌మెంట్ మార్చారన్నారు. రైతాంగానికి టమాటా పంట ద్వారా తీవ్ర నష్టం వాటిల్లుతోందని టమాటా జ్యూస్ ఆధారిత పరిశ్రమ ఏర్పాటుకు చొరవ చూపాలన్నారు. అనంతరం ఈ నెల 20న జరిగే లక్ష సంతకాల సేకరణ, 23న ఆర్డీఓ కార్యాలయం ఎదుట జరిగే ఆందోళన కార్యక్రమాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకుడు రామాంజులు, సీపీఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి విశ్వనాథ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి సుమిత్ర, ఎలక్ట్రికల్ అసోసియేషన్ నాయకుడు అస్లాం, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి వెంకటేష్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథనాయుడు, అహమ్మద్ అలీఖాన్, సురేంద్ర, రియాజ్ పాల్గొన్నారు.


