
ఏఐటీయూసీ నాయకుల అవినీతిపై ఫిర్యాదు
మదనపల్లె రూరల్ : దినసరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తనను ఆప్కాస్ విధానంలో కార్మికురాలిగా చేర్పిస్తామని ఏఐటీయూసీ నాయకులు రూ.70 వేలు వసూలు చేశారని మున్సిపల్ కమిషనర్ ప్రమీలకు స్థానికురాలు పోగుండ రమణమ్మ గురువారం ఫిర్యాదుచేశారు. మీడియాతో రమణమ్మ మాట్లాడుతూ...మున్సిపాలిటీ రెండో డివిజన్‌లో దినసరి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న తన వద్దకు ఏఐటీయూసీ నాయకులైన పృథ్వీరాజ్, ఓబులేసు, నాగరాజు వచ్చి ఆప్కాస్ విధానంలోకి మారుస్తామని చెప్పారన్నారు. పై అధికారులకు రూ.70 వేలు చెల్లించాలని ఒత్తిడి చేశారని, వారి మాటలు నిజమని నమ్మి 16.1.2024న రూ.70 వేలు ఇచ్చానన్నారు. తనను ఆప్కాస్‌లో చేర్చకపోగా, తన డబ్బులు వెనక్కు ఇవ్వలేదని చెప్పింది.సమగ్ర విచారణ జరిపించి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది.