
స్కూల్ అసిస్టెంట్లను ప్రైమరీ స్కూల్‌కు పంపడం సరికాదు
మదనపల్లె సిటీ : పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన జీఓ 19లో మిగులు స్కూల్ అసిస్టెంట్లను మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎంలుగా పంపడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (అపస్) రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఆపస్ కార్యాలయంలో జరిగిన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డీమోషన్ నిర్ణయం ఉపసంహరించుకుని సమాంతరంగా తెలుగు మీడియం కొనసాగిస్తూ,విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్‌గా పరిగణించి ఆ తర్వాత ప్రతి 30 మందికి మరొక సెక్షన్ కేటాయిస్తూ మిగులు స్కూల్ అసిస్టెంట్లను హైస్కూల్, యుపీ స్కూల్స్‌కు మాత్రమే కేటాయించాలన్నారు. జిల్లా అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు తగినంత స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, రాజేశ్వరి, రెడ్డిశేఖర్, నాయకులు సిద్దారెడ్డి, రమణ, కొండారెడ్డి, గిరీష్, గోపాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.