ప్రెస్‌క్లబ్‌లో ఎందుకు.. టీడీపీ ఆఫీస్‌లో పెట్టుకోవచ్చుగా?

YSRCP MLA Ambati Rambabu Slams AB Venkateswara Rao - Sakshi

తాడేపల్లి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసస్‌ స్పైవేర్‌ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ  కొన్నిరోజులు క్రితం అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనిపై ఏపీ అసెంబ్లీలో సోమవారం చర్చ జరగ్గా, ఈ వ్యవహారంపై విచారణకు హౌస్‌ కమిటీ వేస్తున్నట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అయితే ఆ వెంటనే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడం చర్చనీయాంశమైంది. దీనిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

శాసనసభలో హౌస్‌ కమిటీ వేస్తామని స్పీకర్‌ ప్రకటించిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు స్పందించాలి కానీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకు రావడం ఏమిటని నిలదీశారు. చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తారు. అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘పెగాసెస్‌పై శాసనసభ హౌస్ కమిటీని వేసింది. చంద్రబాబు పెగాసెస్ కొన్నారని మమతాబెనర్జీ స్వయంగా అసెంబ్లీలోనే చెప్పారు. దీనిపై మేము కూడా గత ఎన్నికలకు  ముందే చెప్పాం.

మమతాబెనర్జీ చెప్పాక టీడీపీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు. చంద్రబాబు మాత్రం ఇంతవరకు బయటకు వచ్చి దీనిపై ఎందుకు మాట్లాడలేదు?.  ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్నప్పుడు జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతోంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వచ్చి చంద్రబాబును సమర్ధిస్తూ మాట్లాడటం ఆశ్చర్యం వేసింది. ఒక అధికారి ఇలా మాజీ ముఖ్యమంత్రిని వెనుకేసుకు రావటం ఏంటి?, చంద్రబాబు, లోకేష్ ఆస్తులు ఎలా పెరిగాయో విచారణ జరపమంటే ఎందుకు మాట్లాడటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్ అయిన అధికారి మాత్రమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు చంద్రబాబుకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు?. అక్రమాలు జరగలేదని చంద్రబాబు ఎందుకు చెప్పటం లేదు?, ఏబీ వెంకటేశ్వరరావు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు?.. నేరుగా వెళ్లి టీడీపీ ఆఫీసులో పెట్టుకోవచ్చుగా? 

23 మంది మా ఎమ్మెల్యేలను మా పార్టీ నుండి టీడీపీలోకి మార్చలేదా?, చంద్రబాబుకు ఊడిగం చేశారు.  ఐపీఎస్‌ అనే పదవికి సిగ్గుచేటు తెచ్చారు. మా చంద్రబాబుకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన్ని కాపాడటానికి ఏబీ వెంకటేశ్వరరావు ఇప్పుడు బయటకు వచ్చారు. దేశం కోసం కాదు, తెలుగుదేశం కోసం పని చేశారు. ప్రభుత్వ ఉద్యోగిలా కాకుండా టీడీపీ బానిసలాగా వ్యవహరిస్తున్నారు’ అని అంబటి రాంబాబు మండిపడ్డారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top