సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదం నేపథ్యంలో ఘటన స్థలానికి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు వైద్య సాయం అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే వైఎస్సార్‌సీపీ బృందం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంది.
ఈ సందర్బంగా మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఓ ప్రకటనలో..‘కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనలో పలువురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం ఎంతో విచారకరం. ఈ దుర్ఘటన తీవ్రంగా బాధించింది. మృతుల కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. భక్తుల ప్రాణనష్టానికి కారణమైన పరిస్థితులపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ తొక్కిసలాట’ అని తెలిపారు.

మరోవైపు, ఈ ఘటనపై మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పందిస్తూ..‘కాశీబుగ్గ తొక్కిసలాటలో అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దైవ దర్శనానికి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నారని తెలియదా?. ప్రతీ ఏటా ఈరోజున ఎక్కువ సంఖ్యలో వస్తారు కదా?. ముందస్తు సమాచారం ఉన్నా పోలీసులు ఎందుకు భద్రత ఇవ్వలేదు?. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమే. ఈ దుర్ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలి. గత అనుభవాల నుంచి ప్రభుత్వం పాఠాలు నేర్చుకోలేదు’ అని విమర్శలు చేశారు.



