రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించాలని పిలుపు
కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలి
పార్టీ కీలక నేతలతో రాష్ట్ర కో–ఆర్డినేటర్ ‘సజ్జల’ రామకృష్ణారెడ్డి టెలీకాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం తీవ్ర ఆందోళనకర విషయమని వైఎస్సార్‌సీపీ స్టేట్ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచి్చనప్పటికీ.. అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. ప్రస్తుతం దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని సజ్జల పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, పార్టీ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించి.. తక్షణమే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరు, ఆర్డీఓ, తహశీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేయాలని ఆయన సూచించారు. వైఎస్సార్‌సీపీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంటు పరిశీలకులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), రాష్ట్ర కార్యదర్శులు (కో–ఆర్డినేషన్), అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆదివారం సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
బాబు, లోకేశ్ హామీని అమలు చేయాలి..
ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించకపోగా మరింతగా పెంచి సామాన్య ప్రజలపై ప్రభుత్వం భారం మోపుతోంది. ఈ ప్రభావం రైతాంగం, రవాణా రంగం, చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్రంగా పడుతోంది. నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవన వ్యయం మరింతగా భారమవుతోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ టీడీపీ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు.
ఆ హామీని ఇప్పుడు అమలు చేయాలి. వైఎస్సార్‌సీపీతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, అనుబంధ సంఘాలను కూడా కలుపుకుని పార్టీ నేతలు భారీ ప్రదర్శనలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి. వైఎస్సార్‌సీపీ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా వెళ్లేలా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో మీడియా క్యాంపెయిన్, సోషల్ మీడియా ప్రచారాన్ని మరింత బలోపేతం చేయాలి.
ఎస్‌ఐఆర్‌పై అప్రమత్తంగా ఉండండి..
ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో పార్టీ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. బూత్‌ను ఒక యూనిట్‌గా తీసుకుని మైక్రో లెవల్‌లో పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. ప్రతి బూత్‌లో సమర్థవంతమైన బూత్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) నియామకం అత్యంత కీలకం. వీలైనంత త్వరగా వీరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలి. ఎన్నికల జాబితాల సవరణ ప్రక్రియలో ప్రతీ ఓటు విలువైనది. ఎక్కడా నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.


