‘పెట్రో’ ధరల మంట.. భగ్గుమన్న జనం | YSRCP Holds Statewide Protests In Andhra Pradesh Against Petrol And Diesel Price Hike, Demands Rollback From Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘పెట్రో’ ధరల మంట.. భగ్గుమన్న జనం

May 19 2026 4:51 AM | Updated on May 19 2026 9:50 AM

YSRCP agitations on Chandrababu Govt Petrol Prices Issue

పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపునకు నిరసనగా నంద్యాల జిల్లా బనగానపల్లెలో ర్యాలీ చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు

వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో దద్దరిల్లిన రాష్ట్రం

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌  

పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ ఆందోళనలు

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు 

కదంతొక్కిన ప్రజలు, కార్యకర్తలు 

పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ 

ఎక్కడికక్కడ అధికారులకు డిమాండ్‌ పత్రాలు అందజేత 

పలుచోట్ల వినూత్న రీతిలో నిరసనలు  

పెట్రో ధరలకు సంబంధించి చంద్రబాబు మాట తప్పడంపై చర్చ  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: పెట్రో బాదుడుపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ఆందోళనల్లో పార్టీ శ్రేణులతో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని తుంగ­లో తొక్కారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచిన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ నియోజకవర్గ కేంద్రాల్లో ప్రజ­లతో కలిసి ఆ నియోజకవర్గాల వైఎస్సార్‌సీపీ సమ­న్వ­యకర్తలు, పార్టీ నేతలు... కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్‌ పత్రాలను అందజేశారు. 

దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కంటే మన వద్దే పెట్రోల్, డీజిల్‌ ధరలు అధికంగా ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొంటే కేసులు పెడతామంటూ పోలీసుల ద్వారా కూటమి నేతలు బెదిరించినా.. వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా అన్ని వర్గాల ప్రజలు పెట్రో బాదుడుపై కదంతొక్కడంతో వైఎస్సార్‌సీపీ ర్యాలీలు గ్రాండ్‌ సక్సెస్‌ అయ్యాయి. ఇంత భారీగా స్పందన రావడం చంద్ర­బాబు సర్కార్‌లో వణుకు పుట్టించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామంటూ సీఎం చంద్రబాబు అనేక సార్లు హామీ ఇచ్చారు. 

సీఎం చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పాదయాత్రతోపాటు ఎన్నికల ప్రచారంలోనూ తాము అధికారంలోకి వస్తే పెట్రో­లు, డీజిల్‌ ధరలు తగ్గిస్తామంటూ వాగ్దానం చేశారు. కానీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారు. పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచేశారు. దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపారు. పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలకు రెక్కలొచ్చాయి. ఇది జన జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్న పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది.  

కదంతొక్కిన జనం 
పెట్రోల్, డీజల్, గ్యాస్‌ ధరల పెంపుపై ఎన్టీఆర్,కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం ప్రజలతో కలిసి వైఎస్సార్‌సీపీ శ్రేణులు చేపట్టిన నిరసన హోరెత్తించింది. మండే ఎండలోనూ వేలాదిగా ప్రజానీకం కదంతొక్కుతూ ప్రభుత్వానికి తమ నిరసనను తెలిపారు. బైక్‌లను ఎండ్ల బండ్లపై ఉంచి తాళ్లతో లాగుతూ, సైకిల్‌ తొక్కుతూ, ఆటోలను తాళ్లతో లాగుతూ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉమ్మడి వైఎస్సార్‌ కడప, అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల వ్యాప్తంగా ఆందో­ళన కొనసాగింది. పులివెందులలో బొలెరో వాహనానికి తాళ్లు కట్టి నిరసన తెలిపారు. ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఆందోళనలు అట్టుడికాయి. 


తణుకులో ఎడ్ల బండ్లు, గుర్రపు స్వారీలతో, ఏలూరులో గ్యాస్‌ బండలతో నిరసన తెలిపారు. రాజమండ్రి, అమలాపురం, కాకినాడలో ఆటోలను తాళ్లతో లాగుతూ, డాక్టర్‌ బీఆర్‌ అంబే­డ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలో తోపుడు రిక్షాలపై మోటార్‌ సైకిళ్లను ఉంచి వినూత్న రీతిలో ప్రదర్శన చేశారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకు­ళం, విశాఖ జిల్లాల్లో ఎడ్ల బండిపై ప్రయాణిస్తూ, రిక్షా తొక్కుతూ, ఆటోలకు తాళ్లు కట్టి లాగుతూ ర్యాలీ నిర్వహించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో గాడిదను మోటర్‌ బైకులా అలంకరించి వినూత్నంగా ఆందోళన చేపట్టారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement