విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి

YSR Congress Party MPs Petition To Amit Shah On Visakha Steel Plant - Sakshi

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలి 

దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించాలి 

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు వైఎస్సార్‌సీపీ ఎంపీల వినతిపత్రం 

పోలవరానికి నిధుల విడుదల తదితర అంశాలపై చర్చ 

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు కోరారు. ఈ మేరకు వారు వినతిపత్రం అందజేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేయించాలని, దిశ చట్టాన్ని త్వరగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభా పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఎంవీవీ సత్యనారాయణ, తలారి రంగయ్య, డాక్టర్‌ సత్యవతి, వంగా గీత, చింతా అనురాధ, జి.మాధవిలు శుక్రవారం పార్లమెంట్‌లోని హోం మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధుల విడుదల, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఏపీ భవన్‌లో పిల్లి సుభాష్‌చంద్రబోస్, వంగా గీత, ఎంవీవీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడారు.

ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని కోరాం
‘విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు అనే నినాదం తో ఏర్పడిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పరిరక్షించాల్సిన అవసరం ఉందని హోంమంత్రికి చెప్పాం. ప్రధానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకొని ప్రైవేటీకరణ అంశాన్ని పక్కన పెట్టాలని, ప్లాంట్‌ను లాభాల బాట పట్టించే విధంగా చర్యలు చేపట్టాలని కోరాం. దీనిపై అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. ప్రధానితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ విచారణ చేపట్టే విషయమై త్వరలో నిర్ణయం వెలువరిస్తామన్నారు..’ అని సుభాష్‌చంద్రబోస్‌ తెలిపారు. 

ఉద్యోగుల ఆందోళన వివరించాం
‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ విషయంలో ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల ఆందోళన గురించి కేంద్ర హోం మంత్రికి వివరించాం. 32 మంది బలిదానం ఫలితంగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పడటం, అనేక మంది స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం గురించి తెలియజేశాం. వారి త్యాగాలను గుర్తించాలని కోరాం. కర్మాగారం నష్టాలకు కారణాలు చెప్పాం. లాభాల బాటలో నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించాం. స్టీల్‌ ప్లాంట్‌కు క్యాప్టివ్‌ మైన్ల కేటాయింపు లేకపోవడం ఆయన దృష్టికి తెచ్చాం. రూ.23 వేల కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక రుణంగా మార్చాలి లేదా ఈక్విటీగా మార్చాలని కోరాం..’ అని ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు.  

‘దిశ’ దేశవ్యాప్తంగా ఉపయోగపడే చట్టం
‘దిశ చట్టం దేశవ్యాప్తంగా ఉపయోగపడుతుంది. ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా ఆమోదించాలని హోంమంత్రిని కోరాం. ఇందుకోసం ఐపీసీ, సీఆర్‌పీసీ సెక్షన్లలో అవసరమైన మార్పులు చేయాలి. తెలంగాణలో జరిగిన ఘటన నేపథ్యంలో మహిళల రక్షణ కోసం సీఎం జగన్‌ ఈ చట్టాన్ని తెచ్చారు. మహిళలపై దాడుల వంటి ఘటనలను వేగవంతంగా దర్యాప్తు చేసేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. దిశ చట్టం అమలుకు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటున్న చర్యలను, ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్న విషయాన్ని కేంద్రం గమనించాలి. రాష్ట్రంలో సీఎం జగన్‌ అన్ని రంగాల్లో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు..’ అని వంగా గీత తెలిపారు. తమ వినతులపై సానుకూలంగా స్పందించిన అమిత్‌షాకు ఎంపీలు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా వైఎస్సార్‌సీపీ ఎంపీలందరం పోరాడుతామని చెప్పారు. 

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ దీక్షలు ప్రారంభం
ఉక్కునగరం: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ పోరాటంలో భాగంగా స్టీల్‌ ప్లాంట్‌ ఆర్చి వద్ద శుక్రవారం కార్మికుల రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. అప్పట్లో ఉక్కు ఉద్యమంలో పాల్గొన్న కొల్లు రామ్మోహన్‌ ఈ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, గంటా శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య, నన్నపనేని రాజకుమారి తదితరులు శిబిరం వద్దకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top