ఇల్లు కట్టుకోవాలంటే.. డబ్బివ్వు.. | Women File Complaint Against Janasena Leader | Sakshi
Sakshi News home page

ఇల్లు కట్టుకోవాలంటే.. డబ్బివ్వు..

Apr 29 2026 12:00 PM | Updated on Apr 29 2026 12:00 PM

Women File Complaint Against Janasena Leader

కాకినాడ జిల్లా: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకుల దందా రోజురోజుకు పెరిగిపోతోంది. వారి ధనదాహం పెచ్చుమీరిపోయింది. ఇల్లు కట్టుకోవాలంటే తమకు డబ్బవ్వాల్సిందేనని తనను జనసేన నేతలు వేధిస్తున్నారని ఓ పేదమహిళ ఆవేదన చెందుతోంది. వారి వేధింపులు తట్టుకోలేక సీపీఐ, ప్రజాసంఘాల నేతలతో కలిసి ఆమె మంగళవారం ఆందోళనకు దిగింది. స్థానిక జగ్గయ్యచెరువు కాలనీలో పేదమహిళ కఠారి సత్యవతి తనకు ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టింది. ఇది గమనించిన స్థానిక జనసేన నాయకులు కొందరు ముఠాగా ఏర్పడి తమకు కొంత డబ్బు ఇవ్వాలని ఆమెను ఇబ్బందులకు గురిచేయడం మొదలుపెట్టారు. 

జనసేన నాయకులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఈ నెల 20న పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (పాడా) కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదుపై స్పందించిన అధికారులు రికార్డుల ప్రకారం ఇంటి నిర్మాణం సక్రమమేనని, ఎవరూ అడ్డు చెప్పరని, పనులు కొనసాగించవచ్చని లిఖితపూర్వకంగా ఆదేశాలిచ్చారు. అధికారుల ఆదేశాలతో ఆమె ఇంటి పనులు మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన ముఠా మంగళవారం మరోసారి ఆమె వద్దకు వెళ్లి  తమకు డబ్బు ఇవ్వాలని, లేదంటే పనులు నిలిపేయాలని బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సత్యవతి తనకు న్యాయం చేయాలంటూ సీపీఐ, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పాడా కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. 

ఇంతకాలం సరైన ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులకు గురయ్యానని, కష్టపడి ఒక్కో రూపాయి సంపాదించి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిరి్మంచుకుంటుంటే జనసేన నాయకులు అడ్డుపడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. వారం రోజుల కిందట స్లాబ్‌ వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటే జనసేన నాయకులు అడ్డుకున్నారని, దీంతో తీవ్రంగా నష్టపోయానని తెలిపింది. తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న జనసేన నాయకులపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని ఆమె అధికారులను కోరింది.   

Advertisement
 
Advertisement
Advertisement