పిల్లల చదువులపై కోవిడ్‌ ప్రభావం ఎంత?

What is the effect of Covid on childrens education - Sakshi

దేశవ్యాప్తంగా 30 లక్షల మంది విద్యార్థులకు పరీక్ష

నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వేతో అంచనా

ఫలితాల ఆధారంగా దిద్దుబాటు చర్యలు

ఆన్‌లైన్‌ బోధన కొందరికే.. పేద విద్యార్థులకు దూరం

అందరినీ ఒకేగాటన కట్టడంపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా దెబ్బతిన్న విద్యారంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు నేషనల్‌ అచీవ్‌మెంట్‌ సర్వే చేపట్టిన కేంద్ర విద్యాశాఖ పలు తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1.23 లక్షల స్కూళ్లకు చెందిన 30 లక్షల మంది విద్యార్థులు దీనికి హాజరయ్యారు. కోవిడ్‌ కారణంగా 2017 తరువాత సర్వే నిర్వహించలేదు.

శాస్త్రీయతపై అభ్యంతరం..
కోవిడ్‌ ప్రభావంతో దీర్ఘకాలం పాఠశాలలకు దూరమైన విద్యార్ధులు ఏమేరకు చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం చేయగలుగుతున్నారు? దెబ్బతిన్న విద్యార్ధుల చదువులను ఎలా సరిదిద్దాలి? అనే అంశాలపై సర్వే ద్వారా ఒక అవగాహనకు రానున్నారు. విద్యార్ధులు సంతరించుకున్న కొత్త నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు కూడా సర్వే ఉపకరించనుంది. కోవిడ్‌తో పాఠశాలలకు దూరమైన విద్యార్ధులు తమ సమయాన్ని ఇతర అంశాలకు వెచ్చించారు. పెద్దలకు ఇంటి పనుల్లో సహకరించడం, ఫొటోగ్రఫీ, రీడింగ్, గార్డెనింగ్‌ లాంటివాటిల్లో ఆసక్తిని అంచనా వేసేందుకు సర్వేలో కొన్ని అంశాలను పొందుపరిచారు. అయితే సర్వే ప్రమాణాలను, శాస్త్రీయతను కొన్ని టీచర్ల సంఘాలు తప్పుబడుతున్నాయి. కోవిడ్‌ సమయంలో పలువురు విద్యార్థులకు ఆన్‌లైన్‌ వేదికల ద్వారా బోధన జరగలేదు. మరికొంతమంది గతంలో నేర్చుకున్న అంశాలను కూడా మరిచిపోయారు.

ఇప్పుడు విద్యార్ధులందరికీ ఒకే రకమైన పరీక్ష నిర్వహించడం వల్ల సరైన అంచనా ఫలితాలు రావని పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే బోధనాభ్యసన ప్రక్రియలు గాడిలో పడుతున్నాయని, ఈ సమయంలో సర్వేలు నిర్వహించి ఇతర కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయంటున్నారు. స్థానికంగా విద్యార్ధుల పరిస్థితిని ఉపాధ్యాయులే అంచనా వేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కోవిడ్‌ కారణంగా దాదాపు రెండేళ్లు స్కూళ్లు మూతపడటంతో బోధనాభ్యసన ప్రక్రియలకు విద్యార్ధులు దూరం కావడం తెలిసిందే. ఆన్‌లైన్‌ వేదికలు పూర్తిస్థాయిలో విద్యార్ధులకు మేలు చేకూర్చలేకపోయాయి. పట్టణ, మైదాన ప్రాంతాల్లోని పేద విద్యార్ధులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఆండ్రాయిడ్‌ ఫోన్లు అందుబాటులో లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. గ్రామీణ, మారుమూల ఏజెన్సీ విద్యార్ధులకు ఆ అవకాశాలూ లేకపోవడం చదువులపై తీవ్ర ప్రభావం చూపింది. 

రాష్ట్రం నుంచి లక్ష మంది..
నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ సంస్థ) ఈ సర్వే కోసం ప్రశ్నపత్రాలను అందించింది. 3, 5 తరగతుల పిల్లలకు లాంగ్వేజెస్, మేథమెటిక్స్, పర్యావరణ అంశాలపై ప్రశ్నలు రూపొందించారు. 8వ తరగతి విద్యార్ధులకు భాషలు, మేథమెటిక్స్, సైన్సు, సోషల్‌ సైన్సెస్‌లో నైపుణ్యాలను పరీక్షించారు. 10వ తరగతి విద్యార్ధులకు భాషలు, మేథమెటిక్స్‌ సైన్సు, సోషల్‌ సైన్సెస్‌తో పాటు ఇంగ్లీషు అంశాల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించారు. 22 భాషా మాధ్యమాల్లో ఈ పరీక్షలు జరిగాయి. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చాక చేపడుతున్న తొలి సర్వే ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఈ పరీక్షకు లక్ష మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top