
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో చర్చకు డిమాండ్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. మోదీ మాట్లాడిన అంశాలపై ఏపీ ఎంపీలు నోటీసు ఇవ్వాలని కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో చర్చ జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని అన్నారు.
చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి మెజార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇటీవల రాజ్యసభలో ఏపీపై చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్సార్‌సీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి షెడ్యూల్ 9, 10లలో ప్రస్తావించిన 150 సంస్థల విషయం ఎనిమిదేళ్లు అవుతున్నా కేంద్రం తేల్చకపోవడం అన్యాయమన్నారు.