వావిలాల లీలామహేశ్వరి కన్నుమూత | Vavilala Leela maheswari passes away | Sakshi
Sakshi News home page

వావిలాల లీలామహేశ్వరి కన్నుమూత

May 25 2026 4:51 AM | Updated on May 25 2026 4:51 AM

Vavilala Leela maheswari passes away

వావిలాల గోపాలకృష్ణయ్య వారసత్వాన్ని కొనసాగించిన లీలామహేశ్వరి 

సారా నిషేధం, సంపూర్ణ     అక్షరాస్యత ఉద్యమాల్లో కీలకపాత్ర  

ఉపాధ్యాయురాలిగా విశేష సేవలు 

గుంటూరులో ముగిసిన అంత్యక్రియలు  

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌): ‘ఆంధ్రా గాందీ’, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్య పెంచుకున్న కుమార్తె వావిలాల లీలామహేశ్వరి (87) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించారు. వావిలాల గోపాలకృష్ణయ్య నీడలో పెరిగిన లీలామహేశ్వరి ఆయన విలువల్ని పుణికిపుచ్చుకున్నారు. జీవిత చరమాంకంలో గోపాలకృష్ణయ్యను ఆమె కంటికి రెప్పలా చూసుకున్నారు. గుంటూరు అరండల్‌పేట 9/2వ అడ్డరోడ్డులోని వావిలాల గోపాలకృష్ణయ్య నివాసం ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌గా మారగా.. లీలామహేశ్వరి అక్కడే నివసిస్తూ తండ్రి వారసత్వాన్ని, జ్ఞాపకాలను కాపాడుకుంటూ వచ్చారు.

కుమారి వావిలాల లీలామహేశ్వరి 1939 జూన్‌ 4న వావిలాల బ్రహ్మసోమయాజులు, అఖిలాండేశ్వరి అన్నపూర్ణమ్మ దంపతులకు గుంటూరులో జన్మించారు. గోపాలకృష్ణయ్యకు బ్రహ్మసోమయాజులు పెద్ద అన్న. లీలామహేశ్వరిని గోపాలకృష్ణ పెంచుకుని తమ కుమార్తెగా చెప్పేవారు. లీలామహేశ్వరికి ఎనిమిది మంది అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు. అతి పెద్ద కుటుంబం కావడంతో ఆరి్థక పరిస్థితుల దృష్ట్యా లీలామహేశ్వరి పీయూసీ వరకు చదివారు. ఆమె వివాహం చేసుకోలేదు.

ఉపాధ్యాయురాలిగా ఉద్యో గ జీవితాన్ని ప్రారంభించి, అక్కాచెల్లెళ్లు, అన్నదమ్ములను ఉన్నత చదువులు చదివించారు. వారికి వివాహాలు జరిపించారు. ఆ తర్వాత ఆమె కూడా ఎంఏ, బీఈడీ పూర్తి చేశారు. మొదట గుంటూరు లోని సెయింట్‌ ఇగ్నిషియస్‌ బాలికల పాఠశాలలో, ఆ తర్వాత బ్రాడీపేటలోని శ్రీ బండ్లమూడి హనుమాయమ్మ బాలికల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు పొందారు. సారా నిషేధం, సంపూర్ణ అక్షరాస్యత, పలు సామాజిక ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. వావిలాల సంస్థ తరఫున అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం గుంటూరులోని బొంగరాలబీడు శ్మశానవాటికలో నిర్వహించారు.

వావిలాల లీలామహేశ్వరి మృతి సమాజానికి తీరని లోటు
మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సంతాపం 
సాక్షి, అమరావతి: ప్రముఖ స్వాతంత్య్ర సమర­యో­ధుడు వావిలాల గోపాలకృష్ణయ్య కుటుంబానికి చెందిన వావిలాల లీలామహేశ్వరి మృతి­పట్ల మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సంతాపం తెలిపారు. ఆమె జీవితమంతా సేవాభావంతో జీవించారని కొనియాడారు. మహనీయుడు వావిలాల గోపాల­కృష్ణయ్యకు చివరి దశలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వావిలాల సంస్థకు విశిష్ట సేవలు అందించడంతోపాటు ఉపాధ్యాయినిగా అంకితభావంతో పనిచేశారని గుర్తుచేశారు. విద్యార్థుల్లో సామాజిక చైతన్యం పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి అందరికి ఆదర్శమని పేర్కొన్నారు. లీలా మహే­శ్వరి మరణం సమాజానికి తీరని లోటని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement