ప్రత్యేక విమానాలకు పొదుపు ఆంక్షల మినహాయింపు! | Use of Special Flights by Chandrababu and Pawan and Lokesh | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానాలకు పొదుపు ఆంక్షల మినహాయింపు!

May 18 2026 4:19 AM | Updated on May 18 2026 4:19 AM

Use of Special Flights by Chandrababu and Pawan and Lokesh

బాబు, పవన్, లోకేశ్‌కు వెసులుబాటు

ప్రభుత్వ కార్యాచరణలో ప్రత్యేక విమానాల ఊసే లేదు

విదేశీ ప్రయాణాలు ఆరు నెలలు నిలిపివేత

పీఎం ఉజ్వల ఎల్‌పీజీ నుంచి అనర్హుల ఏరివేతకు ప్రత్యేక డ్రైవ్‌

వంట నూనె వినియోగం తగ్గించడంపై ప్రచారం

మంత్రులు, అధికారులు ప్రజా రవాణాని వినియోగించాలి  

సాక్షి, అమరావతి: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అస్థిరత నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ పొదుపు చర్యల్లో ప్రత్యేక విమానాల వినియోగంపై మాత్రం ఆంక్షల్లేవు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన వనరుల పరిరక్షణ, స్వావలంబన కార్యాచరణ ప్రణాళికలో ప్రత్యేక విమానాల వినియోగం గురించి అసలు ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. అంటే ఎప్పటిలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌కు ప్రత్యేక విమానాలను వినియోగిస్తారని, వీరికి వెసులు బాటులో భాగంగానే ఎటువంటి ఆంక్షలు విధించలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 

జిల్లాలకు వెళ్లినా, లేదా హైదరాబాద్‌ వెళ్లినా, లేక మరో రాష్ట్రానికి వెళ్లినా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, ఐటీ శాఖ మంత్రి ప్రత్యేక విమానాలను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఆమోదిస్తే తప్ప, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్యనిర్వాహకులు, కన్సల్టెంట్లు, బోర్డు సభ్యుల అనవసర విదేశీ ప్రయాణాలను రాబోయే ఆరు నెలల పాటు నిలిపివేయాలని కార్యాచరణ ప్రణాళికలో స్పష్టం చేశారు. ఈ ప్రణాళిక అమలును పర్యవేక్షించడానికి సీఎస్‌ అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. 15 రోజులకోసారి ఈ కమిటీ సమావేశమై సమీక్షించాలి.  

కార్యాచరణ ప్రణాళిక ఇలా..
 పీఎం ఉజ్వల యోజన ఎల్‌పీజీ కనెక్షన్లకు సంబంధించి అనర్హులను గుర్తించి వారి కనెక్షన్లు తొలగింపు. ఇందుకోసం ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు, రాష్ట్ర, జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలి. తద్వారా సబ్సిడీ లీకేజీలను తగ్గించాలి. 
 వంట నూనె వినియోగాన్ని తగ్గించడంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. అధిక నూనె వినియోగంతో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులకు గల సంబంధాన్ని తెలియజేస్తూ ఆరోగ్య శాఖ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలి. అధిక వంట నూనె వినియోగాన్ని తగ్గించడం, పోషకాహార అవగాహనను మెరుగు పరచడంపై స్వయం సహాయక బృందాలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు దృష్టి సారింపు.  

సహజ వ్యవసాయం, ఎరువుల తగ్గింపుపై రైతుల్లో అవగాహన కార్యక్రమాలను జిల్లా, మండల స్థాయిల్లో చేపట్టాలి. సహజ వ్యవసాయాన్ని, ఎరువుల వినియోగాన్ని తగ్గించడంపై రైతు భరోసా కేంద్రాలు చురుకుగా ప్రోత్సహించాలి. నానో ఎరువులపై దృష్టి పెట్టాలి.
మంత్రుల సిబ్బంది ఈవీలను తప్పనిసరిగా వినియోగించేలా చూడాలి. ప్రభుత్వ విభాగాలు, భద్రతకు కేటాయించని వాహనాలను, పరిపాలనా వాహన సముదాయాలను దశల వారీగా ఈవీల వైపు మళ్లించాలి.  

 మంత్రులు, సీనియర్‌ అధికారులు, ఎంపిక చేసిన ప్రజా కార్యక్రమాల కోసం ప్రజా రవాణాను వినియోగించాలి.   
 రాజకీయ, ప్రభుత్వ కార్యక్రమాలలో అనవసరమైన కాన్వాయ్‌లు, మోటార్‌ ఊరేగింపులు, అలంకరణ దీపాలు, డీజిల్‌ జనరేటర్ల వాడకాన్ని తగ్గించాలి.  
మంత్రుల కార్యాలయాలు, ప్రభుత్వ నివాసాలు, అధికారిక భవనాలలో రూఫ్‌టాప్‌ సోలార్‌ను తప్పనిసరిగా ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయాలి.   
 అర్హులైన ఉద్యోగులు వారానికి రెండు రోజులు స్వచ్ఛందంగా ఇంటి నుండి పని చేసేలా ప్రోత్సహించడం. విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థలు సెమినార్లు, వర్క్‌షాప్‌లు, అకడమిక్‌ కాన్ఫరెన్స్‌ల కోసం హైబ్రిడ్‌ విధానాలను అవలంబించేలా ప్రోత్సహించాలి.    

Advertisement
 
Advertisement
Advertisement