ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం | A tribal youth 13 year legal battle for a police constable job | Sakshi
Sakshi News home page

ఫలించిన గిరిజన యువకుడి 13 ఏళ్ల న్యాయపోరాటం

May 20 2026 4:39 AM | Updated on May 20 2026 4:39 AM

A tribal youth 13 year legal battle for a police constable job

4 వారాల్లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం ఇవ్వాలని తీర్పుచెప్పిన హైకోర్టు 

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం ఓ గిరిజన యువకుడు చేసిన 13 ఏళ్ల న్యాయపోరాటం ఎట్టకేలకు ఫలించింది. అతడికి కానిస్టేబుల్‌గా ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కేసు ఉందన్న విషయాన్ని దాచిపెట్టాడన్న కారణంతో ఆ గిరిజన యువకుడికి ఉద్యోగం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టింది. సమాజంలోని ఉన్నతవర్గాల వారు ఎన్నో క్రిమినల్‌ కేసులున్నా దేశంలో అత్యున్నత పదవులకు పోటీపడుతున్నప్పుడు.. ఒక పేద గిరిజన యువకుడికి చిన్న సంఘటన ఆధారంగా ఉద్యోగం నిరాకరించడం అన్యాయమని పేర్కొంది. 

ఇలా సమాజంలో వెనుకబడిన యువతకు అవకాశాలు నిరాకరిస్తే, వారు అసాంఘిక శక్తుల వైపు మళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. యువత చేసిన చిన్న తప్పులకు వారిని జీవితాంతం శిక్షించకూడదని, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు సైతం చెప్పిందని గుర్తుచేసింది. వాస్తవం చెప్పకపోవడాన్ని ఆటోమేటిక్‌ అనర్హతగా కూడా పరిగణించరాదంది. పిటిషనరయిన గిరిజన యువకుడిపై నమోదైంది హత్య, దోపిడీ లేదా అత్యాచారం వంటి తీవ్రమైన నేరం కాదని,  కేవలం గ్రామంలో జరిగిన ఒక చిన్న ఘర్షణ అని, అందులోనూ అతను 13వ నిందితుడని పేర్కొంది. 

ఈ కేసు మినహా అతడిపై అంతకు ముందుగానీ, తర్వాతగానీ ఎలాంటి క్రిమినల్‌ రికార్డు లేదని గుర్తుచేసింది. గ్రామీణ గిరిజన ప్రాంతానికి చెందిన పిటిషనర్‌.. ఉద్యోగం పోతుందనే అమాయకత్వపు భయంతోనే తనపై కేసు నమోదైన సమాచారాన్ని దాచిపెట్టాడే తప్ప, అందులో ఎటువంటి దురు­ద్దేశం లేదని పేర్కొంది. సమాచారం దాచిపెట్టిన ప్రతి సందర్భాన్ని ఘోర తప్పిదంగా భావించి ఉద్యో­గాన్ని యాంత్రికంగా రద్దుచేయడం చెల్లదని సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టంగా చెప్పిందని గుర్తుచేసింది. అధికారులు విచక్షణతో, కేసు తీవ్రతను బట్టి నిర్ణయం తీసుకోవాలంది. 

పిటిషనర్‌ ఎంపిక రద్దును చట్టవిరుద్ధంగా, ఏకపక్షంగా పరిగణిస్తూ.. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది. అలాగే  పిటిషనర్‌ ఎంపికను రద్దుచేస్తూ అధికారులు 2011, 2014 సంవత్సరాల్లో జారీచేసిన రెండు మెమోలను రద్దుచేసింది. తీర్పు వచ్చిన రోజు నుంచి నాలుగు వారా­ల్లో పిటిషనర్‌ను పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌) పోస్టులోకి నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషనర్‌కు వేతన సదుపాయాలు, సీనియారిటీ, ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్, జస్టిస్‌ సుబేందు శమంతో ధర్మాసనం ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది.  

పెంచలయ్య నిర్దోషి అని కోర్టు చెప్పినా.. 
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళేనికి చెందిన గిరిజన యువకుడు దొడ్ల పెంచలయ్య 2008లో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. రాతపరీక్ష, శారీరక దారుఢ్య పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగానికి తాత్కాలికంగా ఎంపికయ్యారు. గ్రామంలో రాజకీయ కారణాల వల్ల 2010లో పెంచలయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

తరువాత పోలీసులు ఎంపికయిన అభ్యర్థుల పూర్వ చరిత్రను పరిశీలించే సమయంలో పెంచలయ్యపై కేసు గురించి తెలిసింది. దీంతో పోలీసులు పెంచలయ్య నియామకాన్ని రద్దుచేస్తూ 2011లో ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై 2013లో పెంచలయ్య న్యాయపోరాటం ప్రారంభించారు. తొలుత ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండగానే పెంచలయ్యపై నమోదైన కేసును కింది కోర్టు కొట్టేసింది. 

అతడిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే ట్రిబ్యునల్‌ మాత్రం పెంచలయ్య పిటిషన్‌ను కొట్టేసింది. అటు తరువాత ఈ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి సైతం పెంచలయ్యకు వ్యతిరేకంగా ఉత్తర్వులు జారీచేశారు. దీనిపై ఆయన ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ దేవానంద్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి న్యాయం చేసింది.    

Advertisement
 
Advertisement
Advertisement