మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి | Tribal child dies after adverse reaction to medication | Sakshi
Sakshi News home page

మాత్రలు వికటించి గిరిజన చిన్నారి మృతి

Sep 2 2026 5:39 AM | Updated on Sep 2 2026 5:39 AM

Tribal child dies after adverse reaction to medication

లక్ష్మీపురం పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న చిన్నారులు , జమున (ఫైల్‌)

మరో 41 మంది గిరిజన బాలలు, 16 మంది గిరిజనులకు అస్వస్థత

పోలవరం ఏజెన్సీ గ్రామం గొల్లగుప్పలో తీవ్ర విషాదం

ఎటపాక/చింతూరు: పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. క్లోరోక్విన్‌ మాత్రలు వికటించి ఓ చిన్నారి మృతిచెందగా, మరో 41 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. మరో 16 మంది గ్రామస్తులు కూడా అస్వస్థతకు గురయ్యారు. వారిలో పరిస్థితి విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స నిమిత్తం భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గౌరిదేవిపేట పీహెచ్‌సీ వైద్య సిబ్బంది మంగళవారం గొల్లగుప్ప గ్రామంలో వైద్యశిబిరం నిర్వహించి, గ్రామస్తులకు రక్తపరీక్షలు చేయగా కొంతమందికి మలేరియా పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో గ్రామంలోని జీపీఎస్‌ పాఠశాలకు చెందిన 27 మంది, అంగన్‌వాడీ పాఠశాలకు చెందిన 14 మంది చిన్నారులతో పాటు గ్రామస్తులకు క్లోరోక్విన్‌ మాత్రలు ఇచ్చారు. 

ఆ మాత్రలు వేసుకున్న వారిలో జీపీఎస్‌ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న మడివి జమున (7) అనే చిన్నారి వాంతులు, కడుపు మంటతో తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో అంబులెన్సులో తెలంగాణలోని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారి మృతి చెందినట్టు నిర్ధారించారు. గ్రామంలో మరికొంతమంది చిన్నారులకు కూడా కడుపు నొప్పి, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించడంతో కొందరిని ద్విచక్ర వాహనాలపై అటవీ మార్గం గుండా జాతీయ రహదారి వద్దకు తీసుకొచ్చి అక్కడి నుంచి రెండు అంబులెన్సుల్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. 

మరికొందరిని సమీపంలోని లక్ష్మీపురం పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఆరుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని కూడా భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. గ్రామస్తులు, చిన్నారులు కలిపి భద్రాచలంలో మొత్తం 34 మందికి చికిత్స అందిస్తున్నారు. లక్ష్మీపురం పీహెచ్‌సీలో 24 మందికి ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. విషయం తెలిసిన వెంటనే చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఏఎస్పీ బొడ్డు హేమంత్‌ భద్రాచలం ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

ఆదివాసీ సంఘాల ఆగ్రహం
వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని గ్రామస్తులు, ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా గిరిజన చిన్నారులు మృత్యువాత పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఆదివాసీల ప్రాణాలకు లెక్కలేకుండా పోతోందని ఆదివాసీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత శుక్రవారం కూడా ఇదే గ్రామానికి చెందిన 11 ఏళ్ల పద్దం రోజా అనే బాలిక కడుపునొప్పితో మృతిచెందినట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement