లాహిరి..లాహిరి..లాహిరిలో..

Tourist boats are allowed in Godavari from 7th November - Sakshi

నేటి నుంచి గోదావరిలో పర్యాటక బోట్లకు అనుమతి

తూర్పుగోదావరి జిల్లాలో గండిపోచమ్మ, పోచవరంల నుంచి బోట్లు 

ఏపీటీడీసీ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం 

ఓ వైపు వంపులు తిరుగుతూ సుందరంగా ప్రవహించే గోదావరి.. మరోవైపు అటు కొండ.. ఇటు కొండ.. నట్టనడుమ ఉరకలు పెట్టే గోదావరి.. ఆ వంక గిరిజనుల జీవన సౌందర్యం.. ఈ వంక పచ్చటి ప్రకృతి.. ఇలా భిన్న దృశ్యాలను తిలకిస్తూ సేద తీరాలంటే పాపికొండలను బోటులో చుట్టిరావాల్సిందే. ఈ అద్భుత ప్రయాణానికి నేటి నుంచి బోట్లు బయలుదేరనున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం తర్వాత పాపికొండలకు బోట్లు నిలిచిపోయాయి. మళ్లీ రెండేళ్ల తర్వాత బోట్లు వెళ్లడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో అనుమతులు మంజూరు చేసింది. దీంతో పర్యాటకులు పాపికొండల యాత్రకు ఉవ్విళ్లూరుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం

ఆన్‌లైన్‌ బుకింగ్‌కు అవకాశం..
ఉభయ గోదావరి జిల్లాలకు నడుమ సుమారు 40 కిలోమీటర్ల పొడవునా గోదావరి నదికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. సెలవులు వస్తే చాలు.. పర్యాటకులు జలవిహారం చేస్తూ పాపికొండలను చుట్టేస్తారు. సకుటుంబ సపరివారసమేతంగా వచ్చి పాపికొండల్లోని సుందర ప్రకృతి దృశ్యాలను.. బోటు ప్రయాణంలో ఆహ్లాదాన్ని.. వంపులు తిరుగుతూ హొయలు ఒలకబోసే గోదావరిని చూసి పరవశిస్తారు. బుకింగ్‌కు ఆన్‌లైన్‌ సౌకర్యం ( www. aptdc. gov. in) కూడా ఉంది. దీంతో వివిధ రాష్ట్రాల పర్యాటకులు కూడా బోటు షికారు కోసం రెక్కలు కట్టుకుని మరీ వచ్చేస్తున్నారు. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు రాజమమహేంద్రవరం నుంచి రోడ్డు మార్గంలో పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుకోవాలి.  

ముఖ్యమంత్రి ఆదేశాలతో పటిష్ట భద్రత
పాపికొండల జలవిహార యాత్రలో పర్యాటకుల రక్షణ, భద్రత అంశాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా కచ్చులూరు ప్రమాదం తర్వాత ప్రభుత్వం నూతన విధానాలను రూపొందించింది. ప్రమాదం అనంతరం అప్పట్లో స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజమహేంద్రవరంలో సమీక్ష నిర్వహించారు. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకున్నాకే బోట్లను అనుమతించాలని ఆదేశాలు జారీ చేశారు.

బోట్ల ఫిట్‌నెస్‌ పరిశీలించాకే అనుమతులు
పాపికొండల జలవిహార యాత్రకు ప్రైవేట్‌ బోట్లతోపాటు ఏపీ టూరిజం బోట్లకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు పొందిన 16 బోట్లకు ఏపీ మారిటైమ్‌ బోర్డు అనుమతి ఇచ్చింది. పోచమ్మగండి బోట్‌ పాయింట్‌ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్‌ పాయింట్‌ నుంచి 5 బోట్లకు అనుమతులు లభించాయి. వీటిలో తొలి విడతలో పోచమ్మగండి నుంచి ఆదివారం బోట్లు బయలుదేరనున్నాయి.

ట్రయల్‌ రన్‌ సక్సెస్‌..
తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ చేవూరి హరికిరణ్‌ ఆదేశాలతో శనివారం పోచమ్మగండి వద్ద పర్యాటక బోట్లకు ట్రయిల్‌ రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. పైలెట్‌ బోటు ముందు రాగా వెనుక లాంచీలు పేరంటాలపల్లి లాంచీల రేవు నుంచి బయలుదేరాయి. 

ప్రభుత్వం తీసుకుంటున్న జాగ్రత్తలు ఇవే..
► పర్యాటకుల రక్షణ, భద్రత కోసం రెవెన్యూ, పోలీసు, పర్యాటక, జలవనరుల శాఖలతో ఐదు చోట్ల కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు
► కంట్రోల్‌ రూమ్‌ మేనేజర్‌గా డిప్యూటీ తహసీల్దార్‌.
► పర్యాటక, జలవనరులు, పోలీసు అధికారులు కంట్రోల్‌ రూముల వద్ద పర్యాటకుల రక్షణ భద్రత అంశాలపై మూడు రకాల చెకప్‌లు చేపడతారు. మేనేజర్‌ వీటిని పరిగణనలోనికి తీసుకొని బోటు ప్రయాణానికి అనుమతిస్తారు. 
► పైలెట్‌ స్పీడ్‌ బోటు గజ ఈతగాళ్లతో కూడిన రెస్క్యూ టీమ్‌తో బయలుదేరాలి. దీని వెనుక మరో 3 లేదా 5 బోట్లు ప్రయాణించాలి.
► చివర ఎస్కార్ట్‌ బోటులో శాటిలైట్‌ ఫోన్‌ అందుబాటులో ఉంచారు.
► ప్రతి పాయింట్‌ దాటాక శాటిలైట్‌ ఫోన్‌లో కంట్రోల్‌ రూమ్‌కు సమాచారాన్ని అందించాలి. ఏ చిన్న ఘటన జరిగినా వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు తెలపాలి.
► పైలెట్‌ బోటు లేనిదే జలవిహార యాత్ర నిర్వహించరాదు.
► ప్రయాణించే లాంచీని లైసెన్స్‌ ఉన్న డ్రైవర్‌ మాత్రమే నడపాలి.
► జలవనరుల శాఖ ధవళేశ్వరం వద్ద 3 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న సమయంలోనే విహార యాత్రకు అనుమతి
► నిర్వాహకుల నుంచి అఫిడవిట్లపై సంతకాలు తీసుకున్నాకే బోట్లకు అనుమతి
► నిర్దేశిత సామర్థ్యాన్ని మించి పర్యాటకులను ఎక్కించరాదు.

జాగ్రత్తలు తీసుకునే అనుమతి
గోదావరిలో పాపికొండల పర్యాటకానికి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. గత ఘటనలు పునరావృతం కానివ్వకుండా పర్యాటకుల భద్రతే ప్రథమ లక్ష్యంగా ఏర్పాట్లు చేశాం. బోటులో పరిమితిని బట్టి 70 నుంచి 90 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతిస్తున్నాం.  
–జి.రాఘవరావు, కాకినాడ పోర్టు అధికారి

నిర్వాహకులకు మంచి రోజులు
గోదావరిలో జలవిహారం ప్రారంభమవ్వడంతో బోటు నిర్వాహకులతోపాటు దానిపై ఆధారపడేవారికి మంచి రోజులు వచ్చినట్టే. బోటు షికారు నిలిచిపోవడంతో పనిచేసే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతాం.
–మాదిరెడ్డి సత్తిబాబు, బోట్‌ యజమాని

పర్యాటకులు ఇలా చేరుకోవాలి.. 
తూర్పుగోదావరి జిల్లాలో రెండు చోట్ల నుంచి బోట్లు బయలుదేరతాయి. అవి.. దేవీపట్నం మండలం పోచమ్మగండి ఆలయం వద్ద బోట్‌ పాయింట్‌ నుంచి పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు బయలుదేరతారు. పర్యాటకులు ముందుగా రాజమహేంద్రవరంలోని గోదావరి పుష్కర ఘాట్‌కు చేరుకోవాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కార్యాలయానికి చేరుకుని టికెట్లు కొనుగోలు చేయాలి.. లేదా ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లోనూ బుక్‌ చేసుకోవచ్చు. ఒక్కో వ్యక్తి రూ.1,250 చెల్లించాలి. ఏపీటీడీసీనే పర్యాటకులను రోడ్డు మార్గంలో రాజమహేంద్రవరం నుంచి పురుషోత్తపట్నం మీదుగా పోచమ్మగండికి చేరుస్తుంది.

రాజమహేంద్రవరం నుంచి పోచమ్మగండికి దాదాపు 42 కి.మీ. దూరం. పోచమ్మగండిలో ఉదయం 10 గంటలకు బోటు బయలుదేరుతుంది. బోటులో పర్యాటకులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం శాకాహార భోజనం), సాయంత్రం స్నాక్స్, టీ అందిస్తారు. ఇవన్నీ రూ.1,250 లోనే కలిపి ఉంటాయి. పర్యాటకులు నేరుగా పోచమ్మగండికి కూడా చేరుకుని కూడా టికెట్లు కొనుగోలు చేసి బోటు ఎక్కొచ్చు. పోచమ్మగండి నుంచి ఒక్కో వ్యక్తికి రూ.1,000.

తెలంగాణ నుంచి వచ్చే పర్యాటకులు తూర్పుగోదావరి జిల్లా వీఆర్‌ పురం మండలం పోచవరం చేరుకోవాలి. అయితే ఇక్కడ నుంచి బోట్లు బయలుదేరడానికి మరో నాలుగైదు రోజులు పడుతుందని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ నుంచి ఇంకా టికెట్‌ రేట్లు కూడా నిర్ణయించలేదు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top