ఇంటర్‌ పరీక్షలకు వేళాయె 

Time For Intermediate Exams  In AP - Sakshi

దశల వారీగా పరీక్షలు  ఈనెల 15 నుంచి ప్రారంభం

20 నుంచి ప్రాక్టికల్స్‌  వచ్చేనెల 15 నుంచి థియరీ పరీక్షలు

106 కేంద్రాలు.. 73,521 మంది విద్యార్థులు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఇంటర్మీడియెట్‌ పరీక్షలకు రంగం సిద్ధమైంది. మూడేళ్లుగా ఇంటర్‌ పరీక్షలు పలు కారణాలతో వాయిదా పడటం, అనుకున్న సమయానికి ప్రారంభం కాకపోవడం, కరోనా సమయంలో రద్దు చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్‌ ప్రకారం ప్రభుత్వం పరీక్షలు నిర్వహించేందుకు 
పక్కా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. దీంతో ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం ఈనెల 15 నుంచి పరీక్షలు జరుగనున్నాయి. పూర్వ పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏలూరులోని ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షాణాధికారి ప్రత్యేక దృష్టి సారించారు.  

నైతికత, మానవ విలువలపై పరీక్షలు 
ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా ముందుగా ఈనెల 15న నైతికత, మానవ విలువలు అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా ఈ పరీక్ష ఉత్తీర్ణులు కావాల్సి ఉంది. అలాగే ఈనెల 17న పర్యావరణ విద్య అనే సబ్జెక్టుపై పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు పూర్వ పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఏలూరు జిల్లాలో 96 కేంద్రాల్లో 12,785 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 113 కేంద్రాల్లో 15,966 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 41 కేంద్రాల్లో 5,372 మంది మొత్తంగా 34,123 మంది హాజరుకానున్నారు.  

ప్రాక్టికల్స్‌కు సర్వం సిద్ధం  
పరీక్షల్లో భాగంగా ముందుగా ఒకేషనల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 20 నుంచి వీరికి ప్రాక్టికల్స్‌ ప్రారంభమై వచ్చేనెల 7వ తేదీతో ముగుస్తాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు.  విద్యార్థులు నాన్‌ జంబ్లింగ్‌ విధానంలో పరీక్షలు రాయవచ్చు. మొత్తంగా 8,417 మంది విద్యార్థులు హాజరయ్యే పరీక్షల కోసం 76 కేంద్రాలను సిద్ధం చేశారు.  అలాగే జనరల్‌ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ ఈనెల 26న ప్రారంభం కానున్నాయి. 147 కేంద్రాల్లో 24,227 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.   

వచ్చేనెల 15 నుంచి..  
ఇంటర్మీడియెట్‌ థియరీ పరీక్షలు వచ్చేనెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 73,521 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరి కోసం 106 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు.   

సీసీ కెమెరాల పర్యవేక్షణలో.. 
పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసే సీసీ కెమెరాలన్నింటినీ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రాన్నీ సెల్‌ఫోన్‌రహిత జోన్‌గా ప్రకటించారు. ఎవరూ కేంద్రాలకు సెల్‌ఫోన్‌ తీసుకురాకూడదనే నిబంధన విధించారు.  

ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా..  
గతేడాది కంటే ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా చర్యలు తీసుకున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి వారిని అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులయ్యేలా అధ్యాపకులకు సూచనలిచ్చాం. కళాశాలల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచడానికి ఉదయం, సాయంత్రం స్టడీ అవర్స్‌ నిర్వహిస్తున్నాం. విద్యార్థులు కళాశాలలకు క్రమం తప్పకుండా హాజరయ్యేలా చూడటం, వెనుకబడిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వంటివి చేస్తున్నాం.  
– కె.చంద్రశేఖరబాబు, ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి, ఏలూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top