
చిత్తూరు జిల్లా: కుప్పం మండలం దేవరాజపురంలో విషాదం చోటు చేసుకుంది. నీటి కుంటలోపడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మృతులను శాలిని (5), అశ్విన్ (6), గౌతమి (8)గా గుర్తించారు. ఇంటి పునాది కోసం తవ్విన కుంటలో వర్షపు నీరు చేరగా.. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆడుకుంటూ అటువైపుగా వెళ్లిన చిన్నారులు.. కుంటలో పడి ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
మరో ఘటనలో నలుగురు చిన్నారులు మృతి..
మరో ఘటనలో కారు లాక్ పడి నలుగురు చిన్నారులు మృతి చెందారు. విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు కారు లాక్ పడి మరణించారు. ఆదివారం ఉదయం ఈ నలుగురు చిన్నారులు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. తల్లిదండ్రులంతా ఉదయం నుంచి వెతికినప్పటికీ కనిపించలేదు. అయితే గ్రామంలో మహిళా మండల కార్యాలయం వద్ద ఆగి ఉన్న ఒక కారులోకి నలుగురు చిన్నారులు సరదాగా కూర్చునేందుకు వెళ్లి కారు డోర్ వేశారు. దీంతో కారు డోర్ లాక్ పడడంతో ఊపిరి ఆడక ఉదయ్, చారుమతి, చరిష్మా, మనస్విని మృతి చెందారు.