బొగ్గు.. భగ్గు! 

There was a severe shortage of coal across the country - Sakshi

దేశంలో 115 థర్మల్‌ ప్లాంట్లకు కొరత

అడుగంటుతున్న నిల్వలు.. మూతపడుతున్న ప్లాంట్లు 

13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరెంట్‌కు కటకట 

అల్లాడుతున్న ఉత్తరాది రాష్ట్రాలు 

భారీగా డిమాండ్‌ పెరగడంతో అనివార్యంగా కోతలు 

ఏపీ జెన్‌కోలో బొగ్గు, గ్యాస్‌ కొరతతో తగ్గిన ఉత్పత్తి 

తెలంగాణను ఆదుకుంటున్న ‘సింగరేణి’  

సాక్షి, అమరావతి, సాక్షి, హైదరాబాద్‌: ఎడతెరిపి లేని వర్షాలు.. ఉత్పత్తి, సరఫరాలో అంతరాయాలు, కరోనా నుంచి కోలుకుని పరిశ్రమల్లో వినియోగం పెరగడం, వ్యవసాయ సీజన్‌ కావడం, విదేశీ బొగ్గు ధరలు ఎగబాకడంతో కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోని బొగ్గుకు దేశవ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. కొరత కారణంగా పలు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని విద్యుదుత్పత్తి కేంద్రాల్లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. థర్మల్‌ కేంద్రాల్లో బొగ్గు సంక్షోభంతో సోమవారం నాటికి దేశంలోని దాదాపు 13 రాష్ట్రాల్లో విద్యుత్‌ లోటు ఏర్పడింది. ఫలితంగా విద్యుత్‌ కోతలు అనివార్యమవుతున్నాయి.

అంతర్జాతీయ, దేశీయ విపణిలో బొగ్గు కొరత తీరే వరకు మరికొన్ని రోజుల పాటు కోతలు కొనసాగే అవకా>శాలున్నాయి. జాతీయ స్థాయిలో గ్రిడ్‌ నిర్వహణను నియంత్రించే ‘పవర్‌ సిస్టమ్‌ ఆపరేషన్‌ కార్పొరేషన్‌’(పోసోకో) నివేదికలను విశ్లేషిస్తే వారం పది రోజులుగా పంజాబ్,  రాజస్థాన్, ఉత్తర్‌ప్రదేశ్, హర్యాణా, బిహార్, ఝార్ఖండ్‌ రాష్ట్రాల్లో కోతలు తీవ్ర స్థాయిలో పెరిగిపోయాయి. బిహార్, ఝార్ఖండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం రోజుకు 8 – 7 గంటలకు మించి విద్యుత్‌ సరఫరా ఉండడం లేదని జాతీయ మీడియా పేర్కొంటోంది. దక్షిణాదిన కేరళలో విద్యుత్‌ కొరత గణనీయంగా ఉండగా కర్ణాటక, ఏపీలో స్వల్పంగా కొరత నెలకొంది.  

ప్రపంచవ్యాప్తంగా.. 
ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనడంతో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరిగింది. చైనా లాంటి దేశాలు కూడా బొగ్గు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. విద్యుత్‌ కోతలతో చైనాలోని పరిశ్రమలు అల్లాడుతున్నాయి. మన దేశంలోనూ విద్యుత్తు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. మరోవైపు గత ఏడాది కాలంలో విదేశీ బొగ్గు ధరలు దాదాపు రెట్టింపు కావడంతో బొగ్గు దిగుమతులపై ఆధారపడ్డ థర్మల్‌ ప్లాంట్లపై ఆర్థిక భారం పెరిగిపోయింది. దీంతో దేశీయ కోల్‌ ఇండియా, సింగరేణి బొగ్గుకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. వీటి నుంచి సరఫరాను క్రమంగా పెంచడం ద్వారా సంక్షోభాన్ని అధిగమిస్తామని కేంద్రం పేర్కొంటోంది.  
 
రోజూ 80 – 110 ఎంయూల కొరత 
దేశంలో ఈ ఏడాది తలెత్తిన కొరతలో ప్రస్తుత అక్టోబర్‌ నెల తొలి వారం రోజుల్లోనే ఏకంగా 11.2 శాతం కొరత నమోదు కావడం గమనార్హం. గతేడాది అక్టోబర్‌ తొలి వారంలో తలెత్తిన కొరతతో పోల్చితే ఇప్పుడు ఈ నెల తొలివారంలో 21 రెట్లు పెరిగినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గత వారం రోజులుగా దేశంలో సగటున రోజుకు 3,880 మిలియన్‌ యూనిట్ల (ఎంయూ) వినియోగం ఉండగా 80 – 110 ఎంయూల వరకు కొరత నెలకొంది.

సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ ఆథారిటీ(సీఈఏ) తాజా నివేదిక ప్రకారం దేశంలోని 1,65,066 మెగావాట్ల స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 135 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో సగటున కేవలం నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా విద్యుత్‌ ప్లాంట్లలో 15 – 30 రోజుల ఉత్పత్తికి సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సినా 115 విద్యుత్‌ కేంద్రాల్లో ఆరు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు కొరత నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు స్థాపిత సామర్థ్యం కన్నా తక్కువ సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. 

రాష్ట్రంలో ఇదీ పరిస్థితి.. 
ఏపీలో 8,075 మెగావాట్ల ఉత్పత్తి కోసం సౌర, పవన విద్యుత్‌ వనరుల మీద ఆధారపడాల్సి వస్తోంది.  అయితే వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వీటి నుంచి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరగటం లేదు. రాష్ట్రంలో థర్మల్‌ విద్యుత్‌  కెపాసిటీ 5,010 మెగావాట్లు కాగా వీటికి అవసరమైన బొగ్గు సమకూర్చేందుకు కోల్‌  ఇండియా, సింగరేణి సంస్థలతో పాటు విదేశాల నుంచి దిగుమతులే ఆధారం. జెన్‌కో బొగ్గు ప్లాంట్లకు రోజుకు ఇంచుమించు 70,000 టన్నుల బొగ్గు అవసరం కాగా సెప్టెంబరు చివరిలో 24,000 టన్నులు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేయడంతో ప్రస్తుతం రోజుకు 40,000 టన్నులకు పెరిగింది. 

దొరకని గ్యాస్‌ 
రాష్ట్రంలో గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం 908 మెగావాట్లు ఉన్నప్పటికీ కేవలం 100 మెగావాట్లు విద్యుత్‌ ఉత్పత్తి చేయటానికి మాత్రమే గ్యాస్‌ అందుబాటులో ఉంది. గ్యాస్‌ ప్లాంట్ల నుంచి  పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేయటానికి గ్యాస్‌ లభ్యత లేదు. రాష్ట్రంలోని డిస్కంలలో 63,070 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగం ఉండగా బొగ్గు, జల, పవన విద్యుత్, సౌర విద్యుత్‌ అన్ని కలిపి 50 వేల  మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మాత్రమే లభ్యం అవుతోంది.  

బొగ్గు సంక్షోభం లేకుంటే.. 
రాష్ట్రంలో 20130 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి  సామర్థ్యం ఉండగా 1600 మెగావాట్లు  కృష్ణపట్నం నుంచి, 600 మెగావాట్లు ఆర్‌టీపీపీ  నుంచి, 1,040 మెగావాట్లు హెచ్‌ఎన్‌పీసీఎల్‌ నుంచి, 400 మెగావాట్లు కేఎస్‌కే నుంచి, 7,000 మెగావాట్లు సౌర పవన ఇతర విద్యుత్‌ వనరుల నుంచి లభ్యమవుతోంది. బొగ్గు సంక్షోభం లేకుంటే ఈ విద్యుత్‌ ఉత్పత్తి వనరులు రాష్ట్ర అవసరాలను తీర్చగలుగుతాయి. నిజానికి రాష్ట్రంలో 2018 అక్టోబర్‌లో కూడా బొగ్గు కొరత సంక్షోభం  ఏర్పడింది. అప్పుడు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో డిస్కంలు బయట నుంచి ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేశాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో జెన్‌కో కేంద్రాల చర వ్యయం కంటే తక్కువ ధరకు  విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే విద్యుత్‌ కొనుగోలు వ్యయాన్ని తగ్గించడం కోసం మార్కెట్‌ వేలం నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. 

గ్రామాల్లో పీక్‌ అవర్స్‌లో మాత్రమే 
‘రాష్ట్రంలో ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో విద్యుత్‌ కోతలు విధించడం లేదు. నిర్వహణ కోసం మాత్రమే అక్కడక్కడా సరఫరా ఆపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పీక్‌ అవర్స్‌లో కొంత వరకూ పవర్‌ కట్స్‌ ఉంటున్నాయి. అది కూడా సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్య ఒకటి రెండు గంటలు మాత్రమే’  
– నాగులపల్లి శ్రీకాంత్, ఇంధన శాఖ కార్యదర్శి  

తెలంగాణాలో పరిస్థితి భిన్నం 
తెలంగాణలో సహజసిద్ధంగా బొగ్గు గనులు ఉండటం వల్ల  అక్కడ థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లకు నిరంతరాయంగా బొగ్గు సరఫరా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రం తమ  విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందువల్ల సింగరేణి గనుల నుంచి ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లకు బొగ్గు సరఫరా జరగటం లేదు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు తీవ్ర బొగ్గు కొరత ఎదుర్కొంటున్నప్పటికీ తెలంగాణలో మాత్రమే 5 నుంచి 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండటానికి ఇదే కారణం.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top