ఒక్కో ఎంబీబీఎస్‌ సీటుకు 16.37 మంది పోటీ | There are 16 candidates for each MBBS seat Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఒక్కో ఎంబీబీఎస్‌ సీటుకు 16.37 మంది పోటీ

Aug 22 2021 2:42 AM | Updated on Aug 22 2021 2:42 AM

There are 16 candidates for each MBBS seat Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్‌ సీట్ల కోసం నీట్‌ ప్రవేశ పరీక్ష రాయడానికి మరో 20 రోజులు మాత్రమే గడువు ఉండటంతో విద్యార్థులు కసరత్తు ముమ్మరం చేశారు. ఈ ఏడాది మన రాష్ట్రంలో 59,951 మంది విద్యార్థులు  నీట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య కొంచెం తక్కువ. గతేడాది 62,051 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొత్తం 5,010 సీట్లు ఉన్నాయి. సీట్లు, దరఖాస్తు చేసిన అభ్యర్థుల సంఖ్య చూస్తే ఒక్కో సీటుకు సగటున 11.96 మంది పోటీ పడుతున్నారు. యాజమాన్య సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కాకుండా ప్రభుత్వ సీట్లు, ప్రైవేటు కాలేజీల్లో ఉన్న కన్వీనర్‌ కోటా సీట్లు 3,662 మాత్రమే లెక్కలోకి తీసుకుంటే ఒక్కో సీటుకు 16.37 మంది పోటీ పడుతున్నారు. ఒక్క మార్కులోనే ర్యాంకులు తల్లకిందులవుతాయి. కొంత కాలంగా కోవిడ్‌ మహమ్మారి ఇబ్బంది పెట్టినా, ఎలాగైనా సీటు సంపాదించాలనే దిశగా విద్యార్థులు ప్రిపేర్‌ అవుతున్నారు. ఈ ఏడాది నీట్‌కు దరఖాస్తు చేసిన వారిలో తెలుగు మీడియంలో పరీక్ష రాస్తున్న వారు కేవలం 1,253 మంది మాత్రమే. గత ఏడాది 1600 మందికి పైగా తెలుగులో పరీక్ష రాశారు. ఈ ఏడాది మొత్తం 13 భాషల్లో ప్రవేశ పరీక్ష ఉంటుంది. సెప్టెంబర్‌ 12వ తేదీన నీట్‌ పరీక్ష జరగనుంది.

ఫిజిక్స్‌ మార్కులపైనే గురి
మెజారిటీ విద్యార్థులు ఫిజిక్స్‌ కష్టంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఒక్కో సబ్జెక్టు 180 మార్కులకు ఉంటుంది. ఇలా బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌.. మొత్తం 720 మార్కులకు పరీక్ష ఉంటుంది. మిగతా మూడు సబ్జెక్టుల్లో ఎలా ఉన్నా ఫిజిక్స్‌లో ఎవరు ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగితే వారికి సీటు తప్పక వస్తుందని విద్యార్థుల అభిప్రాయం. కానీ చాలా మంది ఫిజిక్స్‌ కంటే మిగతా మూడు సబ్జెక్టుల పట్లే మక్కువ చూపిస్తారు. కానీ నిపుణులు మాత్రం ఫిజిక్స్‌పై ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తే మంచి స్కోరు సాధించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. కష్టమైన సబ్జెక్టు అని చాలా మంది ఫిజిక్స్‌పై దృష్టి సారించకుండా మిగతా సబ్జెక్టులపై సమయం ఎక్కువగా వెచ్చిస్తారని, కానీ ఫిజిక్స్‌ను కూడా బాగా చదివితే వాటికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవచ్చని సీనియర్‌ ఫ్యాకల్టీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. 

ప్యాట్రన్‌ మారినా ఇబ్బంది లేదు
ఈ ఏడాది ప్రశ్నాపత్రం మారింది. ఆప్షన్‌ ఎక్కువ ఇచ్చారు కాబట్టి పోటీ కాస్త ఎక్కుగా ఉండే అవకాశం ఉంటుంది. అయినా ఏం ఇబ్బంది లేదు. రోజుకు 10 గంటలపైనే ప్రిపరేషన్‌ కొనసాగిస్తున్నా. ఎలాగైనా ప్రభుత్వ కాలేజీలో సీటు తెచ్చుకోవాలన్నదే ధ్యేయం.
– మేసా క్లాడియా, ఇంటర్‌ సెకండ్‌ ఇయర్, ఉయ్యూరు

ఈ 20 రోజులే కీలకం
రానున్న 20 రోజులే కీలకం. ప్రణాళికా బద్ధంగా చదువుకోవాల్సి ఉంది. సులభమైన సబ్జెక్టు కాకుండా కష్టమైన సబ్జెక్టుపై ఎక్కువ ప్రాక్టీస్‌ చేస్తున్నా. ముఖ్యంగా ఫిజిక్స్‌పై దృష్టి సారించా. మొదటి ప్రయత్నంలో సీటు రాలేదు. అందుకే లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటున్నా. ప్రిపరేషన్‌ను బట్టి సీటు సాధించగలనన్న నమ్మకం ఉంది.
– సీహెచ్‌.రవళి, లాంగ్‌టర్మ్‌ కోచింగ్, విజయవాడ

ఒత్తిడి లేకుండా చదవగలగాలి
పరీక్ష దగ్గర పడేకొద్దీ చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. నాకు మొదటి సారి సీటు రాకపోవడానికి ఇదే కారణం. అందుకే ఈ సారి లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌లో ఒత్తిడికి గురికాకుండా ఒక ప్లానింగ్‌తో వెళుతున్నా. నిపుణుల సూచనల మేరకు సబ్జెక్టులపై పట్టు పెంచుకున్నాను.
– అక్సా రాణి, లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ 

ప్రాక్టీస్‌తోనే ఫిజిక్స్‌లో మార్కులు
ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయడం వల్లే ఫిజిక్స్‌లో ఎక్కువ మార్కులు సాధించవచ్చు. చాలా మంది భయపడి ప్రాక్టీస్‌ చేయరు. కొద్దిగా మ్యాథమేటిక్స్‌తో అప్లై చేస్తే ఫిజిక్స్‌లో బాగా స్కోర్‌ చేయొచ్చు. ఫిజిక్స్‌లో మార్కులే సీటును నిర్ణయిస్తాయనేది మర్చిపోకూడదు.
– డి.రాంబాబు, సీనియర్‌ ఫ్యాకల్టీ, ఫిజిక్స్, విజయవాడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement