సాక్షి, విశాఖపట్నం: నగరంలోని సమతా కాలేజీ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులకు గురిచేశారనే కారణంతో విశాఖ సమతా కాలేజీలో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థి సాయితేజ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. న్యాయం చేయాలంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. భవనంపై నుంచి దూకేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.
సాయితేజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు చెబుతున్నారు. యాజమాన్యం న్యాయం చేయకపోతే బిల్డింగ్‌పై నుంచి దూకేస్తానంటూ సాయితేజ సోదరుడు హెచ్చరించారు. న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు.

విశాఖపట్నం ఎంవీపీ కాలనీలోని సమత డిగ్రీ అండ్ పీజీ కళాశాల విద్యార్థి కోన సాయితేజ బలవన్మరణం కలకలం రేపింది. ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులతోనే సాయితేజ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థులు, అతడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సహచర విద్యార్థులు, తల్లిదండ్రులు పోలీసులకు తెలిపిన మేరకు.. తోటి విద్యార్థులతో సరదాగా ఉండే సాయితేజ కొంతకాలంగా తరగతులకు హాజరుకావడంలేదు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా అధ్యాపకులు వేధిస్తున్నట్లు తల్లిదండ్రులు, తమ్ముడి వద్ద పలుమార్లు వాపోయాడు.

ఐదో సెమిస్టర్‌లో భాగంగా స్టాటిస్టిక్స్ రికార్డ్ పూర్తిచేసి ఇటీవల అధ్యాపకురాలికి సబ్మిట్ చేశాడు. అందులో కరెక్షన్స్ ఉన్నాయంటూ ఆమె రికార్డ్‌ను రిజెక్ట్ చేస్తూ వచ్చారు. దీంతో కొన్ని రోజులుగా సాయితేజ మరింత మనస్తాపానికి గురయ్యాడు. చాలాసార్లు కరెక్షన్లు చేసినా అధ్యాపకురాలు రికార్డ్ తీసుకోలేదు. దీంతో మరోసారి కరెక్షన్స్ చేసి సబ్మిట్ చేసేందుకు గురువారం తల్లిదండ్రులతో కలిసి కాలేజీకి వెళ్లాడు. సాయంత్రం వరకు ఆ అధ్యాపకురాలు కళాశాలకు రాకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళదామని తల్లిదండ్రులు చెప్పారు.

ముందు మీరు వెళ్లండి, నేను తరువాత వస్తా.. అని సాయితేజ తల్లిదండ్రులకు, తమ్ముడికి చెప్పాడు. వారు కళాశాలకు వెళ్లి ఎంతసేపు చూసినా.. సాయితేజ రాలేదు. ఫోన్ కూడా తీయలేదు. దీంతో ఇసుకతోటలోని ఇంటికి వెళ్లిన వారికి సాయితేజ ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించి, అతడిని మెడికవర్ హాస్పటల్‌కు తరలించారు. అప్పటికే సాయితేజ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం ఎంవీపీ పోలీసులు అక్కడికు చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.
ఏడాది కాలంగా సాయితేజ ఇద్దరు మహిళా అధ్యాపకుల వేధింపులకు గురవుతున్నట్లు సహచర విద్యార్థులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. సహచర విద్యార్థులతో పాటు తమ్ముడికి కూడా సాయితేజ చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పినట్లు వెల్లడించారు. ఒక అధ్యాపకురాలు ‘ఉదయాన్నే నన్ను ఎందుకు విష్ చేయడంలేదు.. నిన్ను కలవాలని ఉంది.. శివాజీపార్క్‌కి వస్తావా?.. నాగురించి ఒకసారైనా ఆలోచించవా..’ వంటి మెసేజ్‌లు పంపటంతో పాటు తరచు వాట్సాప్ కాల్స్ చేస్తూ లైంగికంగా వేధిస్తున్నట్లు సాయితేజ చెప్పాడని స్నేహితులు తెలిపారు. మరో అధ్యాపకురాలు సబ్జెక్ట్ పరంగా వేధిస్తున్నట్లు ఆరోపించారు.


