ఎండ ప్రచండమే

Temperatures to rise in the state in may - Sakshi

రాష్ట్రంలో పెరగనున్న వడగాడ్పులు

అధిక ఉష్ణోగ్రతలు నమోదు

అడపాదడపా వర్షాలు, గాలులు, పిడుగులు

ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలపై అధిక ప్రభావం

రాయలసీమకు ఒకింత ఉపశమనం

తాజా నివేదికలో వెల్లడించిన ఐఎండీ

సాక్షి, విశాఖపట్నం: భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వేడి వార్త మోసుకొచ్చింది. మే నెలలో తీవ్రమైన వేడిని వెదజల్లే వాతావరణం నెలకొంటుందని బాంబు పేల్చింది. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు కూడా ఎక్కువగానే ఉంటాయని వెల్లడించింది. సాధారణంగా వేసవి మొత్తమ్మీద మే నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎండలు మండిపోయాయి.

మే నెలను తలపించే ఎండలు, వడగాడ్పులు రాష్ట్రంలో అనేకచోట్ల కొనసాగాయి. వివిధ ప్రాంతాల్లో గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. దీంతో మే నెలలో వేసవి తాపం ఎలా ఉండబోతోందోనన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. అందుకు అనుగుణంగానే మే నెలలో ఎండలు, వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతాయని ఐఎండీ వెల్లడించింది.

తాజాగా విడుదల చేసిన మే నెల ముందస్తు అంచనాల నివేదికలో బీహార్, జార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో వడగాడ్పులు వీస్తాయని పేర్కొంది. సాధారణంగా మే నెలలో ఆరేడు రోజుల పాటు వడగాడ్పులు వీస్తాయి. అయితే ఐఎండీ అంచనాలను బట్టి ఈసారి మరో ఆరేడు రోజులు అధికంగా వడగాడ్పులు/తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ ఎస్‌.సెల్లా తెలిపారు. 

కోస్తాంధ్ర కుతకుత
ఐఎండీ అంచనాల ప్రకారం మే నెలలో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాంధ్రలో ఉష్ణతీవ్రతతో పాటు వడగాడ్పుల ప్రభావం అధికంగా ఉండనుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంత జిల్లాల్లో ఉష్ణతాపం కొనసాగుతుంది. అయితే, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాలతో పోల్చుకుంటే రాయలసీమలో వేసవి తీవ్రత ఒకింత తక్కువగా ఉంటుందని అంచనా వేసింది. ఫలితంగా సీమ ప్రాంతానికి ఉపశమనం కలగనుంది. మరోవైపు మే నెలలో రాష్ట్రంలో రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే తక్కువగా నమోదు కానున్నాయి. దీని ఫలితంగా పగలంతా సెగలు పుట్టించినా రాత్రి వేళ మాత్రం కాస్త వాతావరణం ఊరట కలిగించనుంది. 

ఈదురు గాలులు, పిడుగుల ప్రతాపం!
కాగా, మే నెలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు సైతం కురవనున్నాయి. అదే సమయంలో పిడుగులు కూడా పడే ప్రమాదం ఉంది. అయితే, రాష్ట్రంలో మే నెలలో కురిసే సాధారణ వర్షపాతం కంటే కాస్త తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఉష్ణతీవ్రత, వడగాడ్పులు, ఈదురుగాలులు, పిడుగులు సంభవించే వాతావరణం నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top