కొత్త ఫ్లూ ప్రభావం.. తెలుగు రాష్ట్రాలకు హైఅలర్ట్‌

Telugu States put on high alert over Influenza A H3N2 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్  తాజాగా హైఅలర్ట్‌ జారీ చేసింది. సాధారణ ఫ్లూకి భిన్నంగా కొత్త ఫ్లూ దేశంలో విజృంభిస్తోందని, అప్రమత్తంగా ఉండాలని ఇరు రాష్ట్రాలను హెచ్చరించింది. 

Influenza A H3N2 కొత్త ఫ్లూ(H3N2 వైరస్‌) ప్రభావంతో ప్రస్తుతం ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తున్నాయి. వైరల్‌ ఫీవర్‌ పేషెంట్లతో ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. చాలామందిలో అవి తీవ్రంగా.. దీర్ఘకాలికంగా ఉంటున్నాయి. కొందరిలో అయితే జ్వరం తర్వాత న్యూమోనియాగా మారి శ్వాసకోశ ఇబ్బందులకు గురి చేస్తోంది కూడా. 

ఈ తరుణంలో.. జాగ్రత్తగా ఉండాలని ఐసీఎంఆర్‌ దేశ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. వైరస్‌ వ్యాప్తి చెందనివ్వకుండా అడ్డుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాలని కోరింది. మరీ ముఖ్యంగా వైద్యులను సంప్రదించకుండా యాంటీ బయోటిక్స్‌ వాడకూడదని ప్రజలను, మరోవైపు ఇన్‌ఫెక్షన్‌లను నిర్ధారించుకోకుండా యాంటీ బయోటిక్స్‌ పేషెంట్లకు సూచించకూడదని వైద్యులను హెచ్చరించింది ఐసీఎంఆర్‌.  

అలాగే.. ఈ ఫ్లూ నుంచి కోలుకున్నాక కూడా దీర్ఘకాలిక ప్రభావం ఉండొచ్చని, ఈ వైరస్‌తో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతోంది ఐసీఎంఆర్‌.  ఇదిలా ఉంటే.. కోవిడ్‌ తర్వాత ఫ్లూ కేసులు ఇంత స్థాయిలో ప్రభావం చూపించడం గమనార్హం.

ఇదీ చదవండి: H3N2 వైరస్‌ తీవ్రంగా ఎందుకు ఉందంటే..

లక్షణాలు గనుక కనిపిస్తే.. 

చేతులు శుభ్రంగా కడుగుతూ ఉండాలి. 

ముఖానికి మాస్క్‌ ధరించాలి.

గుంపులోకి వెళ్లకపోవడం మంచిది. 

ముక్కు, నోరును చేతులతో ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

దగ్గు, తుమ్మేప్పుడు ముక్కు, నోరుకు ఏదైనా అడ్డుపెట్టుకోండి

ఇవి చేయకుండా ఉండడం బెటర్‌

ఇతరులకు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వకపోవడం,

బహిరంగంగా ఉమ్మేయడం, చీదిపడేయడం

గుంపుగా కలిసి తినకుండా ఉండడం

సొంత వైద్యం జోలికి పోకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top