తహసీల్దారుతో వాగ్వాదానికి దిగిన టీడీపీ నాయకులు
చెప్పినట్లు వినండి.. లేదంటే వెళ్లిపోండి
దళిత మహిళా తహసీల్దారు పట్ల టీడీపీ నేతల దౌర్జన్యం
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో కార్యాలయంలోకి రానివ్వకుండా అడ్డగింత
సిబ్బందిని లోపల నిర్బంధించి బయట తహసీల్దార్‌తో వాగ్వాదం
ఇష్టానుసారం మాట్లాడుతూ తీవ్ర బెదిరింపులకు దిగిన నేతలు
ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు నిల్చోబెట్టి తిట్ల పురాణం
లోపల కూర్చొని మాట్లాడుకుందామని బతిమాలినా పట్టించుకోని వైనం
స్థానికులు గుమికూడటంతో తీవ్రంగా హెచ్చరిస్తూ వెళ్లిపోయిన పచ్చ మంద
విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సిబ్బంది
బాధిత తహసీల్దార్‌కు ఫోన్ చేసి మాట్లాడిన జేసీ
ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో విషయం బయటకు పొక్కకూడదని సూచన
సాక్షి టాస్క్ ఫోర్స్: తాము చెప్పినట్లు పని చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని, పార్లమెంటు ముఖ్య నేతను కాదని ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తామంటూ గంపలగూడెం తహసీల్దారు రాజకుమారిని టీడీపీ నాయకులు సోమవారం తీవ్రంగా బెదిరించారు. కార్యాలయం లోపలకు వెళ్లనివ్వకుండా బయటే అడ్డుకుని వీరంగం సృష్టించారు. తమ మాట విననప్పుడు ఇక్కడ పని చేయడానికి వీల్లేదని తేల్చి చెప్పారు. లోపలున్న సిబ్బంది బయటకు రాకుండా తలుపులు వేసి మరీ దౌర్జన్య కాండ కొనసాగించారు. ఉద్యోగ వర్గాలను తీవ్ర భయాందోళనకు గురి చేసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండల తహసీల్దార్ కార్యాలయానికి ఉదయం 10.30 గంటల సమయంలో తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానుకొండ రామకృష్ణ, తిరువూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగళ్ల లక్ష్మీ అనిత భర్త వీరారెడ్డి ఆధ్వర్యంలో పది మందికి పైగా కార్యకర్తలు వచ్చారు. గట్టిగా కేకలు వేస్తూ.. తహసీల్దారు రాజకుమారి వచ్చారా అంటూ హంగామా సృష్టించారు. ఆమె ఇంకా విధులకు రాలేదని సిబ్బంది చెప్పడంతో కార్యాలయంలోంచి వారెవరూ బయటకు రాకుండా తలుపులు వేసి బంధించారు.
ఇంతలో కార్యాలయం వద్దకు చేరుకున్న తహసీల్దారు రాజకుమారి లోపలకు వెళ్లేందుకు ప్రయతి్నంచగా అడ్డుకున్నారు. ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తీవ్ర పదజాలంతో దూషిస్తూ తాము చెప్పిన పనులు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. లోపలకు వెళ్లి కూర్చుని మాట్లాడుదామని తహసీల్దారు కోరినా వినిపించుకోకుండా రెచి్చపోయారు. గంపలగూడెంలో ఉద్యోగం ఎలా చేస్తావో చూస్తామంటూ బహిరంగంగా హెచ్చరించారు.
మీరు మాకు అక్కర్లేదు..
‘మాకు అనుకూలంగా పనిచేయని అధికారి మాకొద్దు. చెప్పినట్లు వినండి.. లేదంటే వెళ్లిపోండి.. భూముల రీసర్వేలో మేము చెప్పినట్లు నడుచుకోనప్పుడు ఇక్కడ మీరు ఉద్యోగం చేయనక్కర్లేదు. మీరు లోపలకు వెళ్లడానికి వీలు లేదు. మేం ఏం పని చెప్పినా మీరు చేయడం లేదు. మేము చెప్పినట్లు సర్వే చేయడానికి మీకొచ్చిన ఇబ్బంది ఏమిటి? మిమ్మల్ని కార్యాలయంలోకి వెళ్ళనీయబోం’ అంటూ టీడీపీ నేతలు తహసీల్దార్‌పై విరుచుకుపడ్డారు. కార్యాలయం లోపలికి వెళ్లి కూర్చొని, మీ సమస్య గురించి వివరంగా మాట్లాడుకుందామని తహసీల్దారు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఇష్టానుసారం మాట్లాడారు. సుమారు గంట సేపు అంటే 11.30 గంటల వరకు ఆమెను కార్యాలయం బయటే నిలబెట్టి.. బెదిరించారంటే పరిస్థితి ఎంత భయానకంగా ఉందో ఇట్టే అర్థమవుతోంది.
మొన్ననే వెలుగు అధికారిని కొట్టాను..
కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి భూములకు సంబంధించి తాము చెప్పినట్లు వినాలని, రీసర్వేలో తమకు అనుకూలంగా పని చేయాలని అనేకసార్లు టీడీపీ నేతలు తహసీల్దార్‌పై ఒత్తిడి తెచ్చారు. చేయగలిగే పనులు చేస్తూనే.. నిబంధనలకు పూర్తి విరుద్దంగా, మరొకరికి అన్యాయం జరిగేలా ఉన్న వాటిని చేయలేమని తహసీల్దార్ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు రెండు రోజుల క్రితం విజయవాడలో పార్లమెంటు ముఖ్య నేతను కలిసినట్లు సమాచారం. ఆయన ప్రోద్బలంతోనే సోమవారం వారు నేరుగా తహశీల్దారు కార్యాలయం వద్దకే వెళ్లి ఆమెను బెదిరించారు.
ఈ క్రమంలో గంపలగూడెం మండల టీడీపీ అధ్యక్షుడు మానికొండ రామకృష్ణ.. ‘కొద్ది రోజుల క్రితమే వెలుగు అధికారిని కొట్టాను.. నిన్ను కొట్టడం పెద్ద పని కాదు’ అని తహశీల్దారుపై రెచి్చపోయారు. కార్యాలయంలో బందీలుగా ఉన్న సిబ్బంది, సందర్శకుల ద్వారా విషయం తెలుసుకుని జనం గుమికూడటంతో టీడీపీ నేతలు ఆమెను హెచ్చరిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాస్తవానికి ప్రధానంగా గంపలగూడెం మండలం సొబ్బాలలో ఇద్దరు రైతుల నడుమ భూ సమస్య నెలకొంది. ఒకరికి అనుకూలంగా సర్వే చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సర్వే నిర్వహించడానికి ఏర్పాట్లు చేసుకుంటుండగా యథాతథ స్థితి కొనసాగేలా కోర్టు ఉత్తర్వులు ఇచి్చంది. దీంతో సర్వే ఆగిపోయింది. ఇదే విషయాన్ని తహసీల్దార్ చెప్పినా, టీడీపీ నేతలు పట్టించుకోక పోవడం గమనార్హం.
బయటకు మాట్లాడకండి..
ఈ ఘటనపై తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్‌కు తెలియజేసే ప్రయత్నం చేశారు. కలెక్టర్ సెలవులో ఉన్నారని తెలిసి విషయాన్ని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో జేసీ.. బాధిత తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడారని తెలిసింది. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రావడంతో ఈ ఘటన గురించి బయటకు మాట్లాడొద్దని తహసీల్దార్‌కు జేసీ సూచించినట్లు విశ్వసనీయ సమాచారం.
అందువల్లే ఆమె ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. ఈ ఘటనపై బాధిత తహశీల్దార్‌ను సంప్రదించగా సర్వేకు సంబంధించి టీడీపీ నేతలు వివరాలు అడిగారని చెప్పారు. ఇదిలా ఉండగా గతంలో ఇక్కడ తహసీల్దారుగా పనిచేసిన భాస్కరరావుపై కూడా టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. మరో తహసీల్దారు ఆశియ్యను కూడా ఇష్టం వచి్చనట్లు తిట్టి ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడారు. ఇప్పుడు తహసీల్దారు రాజకుమారి పట్ల కూడా అలానే వ్యవహరించారు. ఇలాగైతే ఏ అధికారి అయినా ఎలా పని చేస్తారని ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.


