
రెండు విడతల్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రైవేటుకు ధారాదత్తం
అధికారుల కమిటీ ప్రతిపాదనలను ఆమోదిస్తూ వైద్య శాఖ ఉత్తర్వులు
66 ఏళ్ల పాటు ఎకరం రూ.100 చొప్పున లీజుకిచ్చేందుకు గ్రీన్ సిగ్నల్
రూ.వందల కోట్ల విలువ చేసే కళాశాలలు ప్రైవేట్ పరం
ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో టెండర్లు
తొలి విడతలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె
రెండో విడతలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం
విద్యార్థులను నమ్మించి గొంతు కోసిన టీడీపీ కూటమి ప్రభుత్వం
కొత్త వైద్య కళాశాలల్లో సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోకి తెస్తామని నాడు టీడీపీ హామీ
అధికారంలోకి రాగానే ‘వైద్య’ వ్యాపారంతో అయిన వారి జేబులు నింపే వ్యూహం
సాక్షి, అమరావతి: డాక్టర్ కావాలని కోటి ఆశలు పెట్టుకున్న రాష్ట్ర విద్యార్థులను టీడీపీ కూటమి ప్రభుత్వం నమ్మించి గొంతు కోసింది. ప్రతిపక్షంలో ఉండగా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ సీట్లన్నీ ప్రభుత్వ కోటాలోకి తెస్తామని హామీలిచి్చ, గద్దెనెక్కాక నిలువునా వంచించింది. సీట్లను ప్రభుత్వ కోటాలోకి తేవడం అటుంచి.. ఏకంగా కళాశాలలనే కారు చౌకగా ప్రైవేట్‌పరం చేయడానికి పూనుకుని విద్యార్థులతో పాటు, రాష్ట్ర ప్రజలకూ సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన 10 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానం ద్వారా ప్రైవేట్‌పరం చేయడానికి ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వైద్య కళాశాలలను పీపీపీలో నిర్వహణకు అధికారుల కమిటీ సూచించిన ప్రతిపాదనలకు మంగళవారం వైద్య శాఖ ఆమోదం తెలిపింది. రెండు విడతల్లో 10 కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టడానికి అనుమతిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టెండర్ల ద్వారా వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే బాధ్యతను ఏపీ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థకు అప్పజెప్పారు. తొలి దశలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె.. రెండో విడతలో నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుకొండ, పార్వతీపురం వైద్య కళాశాలలు ప్రైవేట్‌కు ధారాదత్తం చేయనున్నారు.
ఏకంగా 66 ఏళ్లపాటు హక్కులు
⇒ సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలికారు. తీరా అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి కత్తెర వేసి పేదలను నిలువునా దగా చేశారు. ప్రభుత్వాస్తులను అస్మదీయులకు దోచి పెట్టడం కోసం పీపీపీ ముసుగులో కుట్రలకు తెరలేపారు. ఈ కుట్రలో రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కల, నిరుపేదల ఉన్నత వైద్యం ఆశలు నెరవేర్చే ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులకూ మినహాయింపు ఇవ్వలేదు.
⇒ తద్వారా తాను నడుపుతోంది ప్రభుత్వం కాదని.. నారా వారి మాయాబజార్ అని బాబు మరోసారి నిరూపించుకున్నారు. రూ.వేల కోట్ల ప్రజాధనం వెచి్చంచి, వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న వైద్య కళాశాలలు, బోధనాస్పత్రులు, వాటి భూములను తేరగా పప్పు బెల్లాలుగా అస్మదీయులకు పంచిపెడుతున్నారు. పీపీపీ నిర్వహణ పేరిట ఏకంగా 66 ఏళ్ల పాటు వాటిపై హక్కులు కల్పించబోతున్నారు.
⇒ విశాఖలో రూ.కోట్ల విలువైన భూమి ఉర్సాకు ఎకరం రూ.99 పైసలకే కట్టబెట్టడానికి యత్నించిన విధంగానే వైద్య కళాశాలలకు సంబంధించిన విలువైన భూమిని ఎకరానికి కేవలం రూ.100గా నిర్ణయించారు. ఒక్కో వైద్య కళాశాల 50 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉంటుంది. ఈ లెక్కన రూ.వందల కోట్ల విలువ చేసే భూములను కారు చౌకగా పెట్టుబడిదారులకు తేరగా అప్పగించేస్తుండటం

విస్తుగొలుపుతోంది.
⇒ ప్రైవేట్ వ్యక్తుల అజమాయిïÙలో నడిచే వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల్లో పేదలకు ఉచిత వైద్య సేవలు ఉండవు. ఈ కళాశాలలు ప్రభుత్వం ఆధ్వర్యంలో పని చేస్తే ఓపీ, ఐపీ, రోగ నిర్ధారణ, అవయవాల మార్పిడి వంటి పెద్ద శస్త్ర చికిత్సలు సైతం పేదలకు పూర్తి ఉచితంగా అందుతాయి. పీపీపీలో ప్రైవేట్‌కు ఇచ్చేస్తున్న నేపథ్యంలో 30 శాతం పడకల్లో ఇన్ పేషంట్, రోగ నిర్ధారణ, మందు బిళ్లలకు ప్రజల నుంచి యాజమాన్యానికి డబ్బు వసూళ్లు చేసుకునే వీలు కలి్పంచారు. సగం మెడికల్ సీట్లను ప్రైవేట్ వైద్య కళాశాలల్లో మాదిరిగానే అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చారు.
2,450 మంది జీవితాలు తలకిందులు
⇒ ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల ద్వారా మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు పెంపు, బోధనాస్పత్రి రూపంలో పేదలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ చేసే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం 17 కొత్త కళాశాలలకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఐదు కళాశాలలు 2023–24లోనే అందుబాటులోకి రావడంతో రాష్ట్రానికి 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి.
⇒ 2024–25 విద్యా సంవత్సరంలో మదనపల్లె, మార్కాపురం, ఆదోని, పులివెందుల కళాశాలలు ప్రారంభం అవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుçపడింది. పులివెందులలో 50 సీట్లతో తరగతుల ప్రారంభానికి ఎన్‌ఎంసీ అనుమతులు ఇవ్వగా, ప్రభుత్వమే కుట్ర పూరితంగా లేఖ రాసి అనుమతులు రద్దు చేయించింది.
⇒ గత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పాడేరులో 50 సీట్లతో తరగతులు ప్రారంభం అయ్యాయి. వాస్తవానికి గతేడాదే 750 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాల్సి ఉండగా బాబు ప్రభుత్వ దిక్కుమాలిన చర్యలతో ఏకంగా 700 సీట్లు రాష్ట్ర విద్యార్థులు కోల్పోయారు. మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరం ప్రారంభం అవ్వాల్సిన పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం కళాశాలలు ఆగిపోయాయి. ఈ కళాశాలలు ఈ ఏడాది ప్రారంభమై ఉంటే 1,050 సీట్లు సమకూరేవి.
⇒ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కోసం కళాశాలలు రాకుండా బాబు ప్రభుత్వం అడ్డుపడటంతో 2024–25లో 700 సీట్లు, 2025–26లో 1,750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. దీంతో డాక్టర్ కావాలని ఆశలు పెట్టుకున్న 2,450 మంది విద్యార్థుల జీవితాలు ఇప్పటికే తలకిందులు అయ్యాయి.