
జరగని మద్యం స్కామ్‌పై టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం
రోజుకో కట్టుకథ.. ఆ కథను అమలు చేస్తూ సిట్ దర్యాప్తు
వైఎస్సార్‌సీపీ నేతలే లక్ష్యంగా తప్పుడు కేసులు..
తాజాగా ఈడీ సోదాలు అంటూ కుప్పిగంతులు
వాస్తవానికి అసలు ‘స్కిల్’ నిందితుడు చంద్రబాబేనని నాడు సిట్, ఈడీ స్పష్టీకరణ
జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి తెలియకుండా ఆ కంపెనీతో ఒప్పందం పేరుతో దోపిడీ
నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల.. చంద్రబాబు అవినీతి నెట్‌వర్క్‌ను ఆధారాలతో సహా బయట పెట్టిన ఈడీ
షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన ముడుపుల బాగోతం బట్టబయలు
ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయో గుర్తింపు
అక్కడి నుంచి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్నదీ నిర్ధారణ
అన్ని ఆధారాలతో డిజైన్ టెక్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల జప్తు
చంద్రబాబుకు సన్నిహితులు, షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు
సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ, డిజైన్ టెక్ కంపెనీ ఎండీ సహా పలువురి అరెస్ట్.. బాబు బాగోతం నిగ్గు తేలడం వల్లే చంద్రబాబు అరెస్టు
52 రోజులు రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైనం
బాబు అవినీతిని కడిగి పారేసిన కాగ్.. బాబు సన్నిహితులకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు
ఇదీ గురివింద చంద్రబాబు అవినీతి బండారం
సాక్షి, అమరావతి: మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ చంద్రబాబు కూటమి ప్రభుత్వం, ఎల్లో మీడియా ఎక్కడలేని హడావుడి చేస్తోంది. పనిగట్టుకుని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు వండి వారుస్తోంది. జరగని స్కామ్‌ను జరిగినట్లు చూపడానికి కుట్రలు, కుతంత్రాలతో కుప్పిగంతులు వేస్తోంది. అదిగో పులి అంటే.. ఇదిగో తోక అంటూ రోజుకో కట్టుకథ చెబుతూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తోంది. చంద్రబాబు ఏరికోరి నియమించిన సిట్ దర్యాప్తులో ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేక పోగా, ఇప్పుడు ఈడీ పేరు చెప్పి దుష్ప్రచారంలో మరో అంకానికి తెర తీసింది.
దుబాయ్‌లో డబ్బులంటూ హంగామా చేస్తోంది. లేని స్కామ్‌ను పట్టుకుని కక్ష పూరితంగా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. మద్యం అక్రమ కేసులో ఈడీ జోక్యం చేసుకుందంటూ హడావుడి చేస్తున్న నేపథ్యంలో అసలు స్కామ్ అంటే ఎలా ఉంటుంది.. ఇదే చంద్రబాబు ముఖ్య నిందితుడిగా ఉన్న ‘స్కిల్’ కేసులో ఈడీ ఎలా కొరడా ఝుళిపించిందో.. అన్ని ఆధారాలతో నాటి సిట్.. చంద్రబాబు బండారాన్ని ఎలా బట్టబయలు చేసిందో గుర్తు చేసుకోవాలంటే ఆ కేసు మూలాల్లోకి వెళ్లాల్సిందే.
ఆ కేసులో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన ఇదే చంద్రబాబు ఎన్ని శ్రీరంగ నీతులు చెబుతున్నా ఆయన ‘స్కిల్ క్రిమినల్’ అని సీఐడీ ఏనాడో తేల్చి చెప్పింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా అదే విషయాన్ని నిగ్గు తేల్చింది.
రూ.370 కోట్ల అంచనాలు రూ.3,300 కోట్లకు పెంచేసి..
2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజా ధనాన్ని కొల్లగొట్టడాన్నే చంద్రబాబు లక్ష్యంగా చేసుకున్నారు. డిజైన్ టెక్ కంపెనీకి చెందిన సంజయ్ దంగాను పిలిపించుకుని యువతకు నైపుణ్య శిక్షణ పేరిట ఉత్తుత్తి ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ ముసుగులో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. వాస్తవానికి సీమెన్స్ కంపెనీకి ఈ ప్రాజెక్టు గురించి ఏమాత్రం తెలియదు. భారత్‌లో ఆ కంపెనీ ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ వినాయక్ కన్విల్కర్ సహకారంతో చంద్రబాబు అక్రమాలకు తెర తీశారు.
మొదట విద్యా శాఖ ద్వారా సీమెన్స్ కంపెనీ పేరుతో 2014 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ మేరకు జీవో జారీ చేశారు. అయితే అడ్డగోలుగా నిధులు కొల్లగొట్టడానికి కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే చంద్రబాబు ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్‌ఎస్‌డీసీతో సీమెన్స్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు మభ్యపుచ్చారు.
సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర అంశాలకు సంబంధించిన ఇన్వాయిస్‌లు, ప్రాథమిక నివేదిక ప్రకారం ఈ ప్రాజెక్టు విలువ రూ.370 కోట్లు మాత్రమే. చంద్రబాబు దీన్ని అమాంతం రూ.3,300 కోట్లకు పెంచేసి ఆ మేరకు నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ప్రభుత్వం పది శాతం నిధులు సమకూరిస్తే సీమెన్స్, డిజైన్ టెక్ 90 శాతం నిధులు పెట్టుబడి పెట్టేలా ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2015 జూన్ 30న ఉత్తర్వులు జారీ చేశారు.
ఎయిడ్ లేదు.. కైండ్ అంత కంటే లేదు
అనంతరం డిజైన్ టెక్ కంపెనీని రంగంలోకి తెచ్చారు. సీమెన్స్–డిజైన్ టెక్ కంపెనీలు ప్రాజెక్ట్ వ్యయంలో 90 శాతాన్ని ‘గ్రాంట్ ఇన్ ఎయిడ్’గా సమకూరుస్తాయంటూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీకి తెలియకుండా సుమన్ బోస్ నడిపిన ఉత్తర ప్రత్యుత్తరాల్లో (నేరుగా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుకు లేఖలు రాశారు) గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే పదం ఎక్కడా లేదు.
ఆ స్థానంలో ‘గ్రాంట్ ఇన్ కైండ్’ అని పేర్కొన్నారు. పోనీ ఆ విధంగానైనా సాఫ్ట్‌వేర్, ఇతర మౌలిక సదుపాయాలు ఉచితంగా అందించారా? అంటే అదీ లేదు. ప్రాజెక్టు వ్యయంగా చెప్పుకున్న రూ.3,300 కోట్లలో 90 శాతం కాదు కదా కనీసం ఒక్క రూపాయి విలువైన ఆరి్థక సహకారంగానీ, వస్తు సహాయాన్ని గానీ అందించ లేదు. అంటే గ్రాంట్ ఇన్ ఎయిడ్ లేదు.. గ్రాంట్ ఇన్ కైండ్ అంత కంటే లేదు.
చివరికి చంద్రబాబు దోపిడీ మాత్రమే మిగిలిందని స్పష్టమైంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ అని ఉంటే టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు.ఓ ప్రాజెక్టులో ప్రైవేటు కంపెనీలు లాభం తీసుకుంటే నిబంధనల ప్రకారం టెండర్లు పిలవాలి. టెండర్లు పిలిస్తే అర్హత ఉన్న ఎన్నో కంపెనీలు పోటీ పడతాయి. అందుకే టెండర్ల ప్రక్రియ అనేది లేకుండా ఏకపక్షంగా నామినేషన్ విధానంలో డిజైన్ టెక్‌కు ఈ ప్రాజెక్టును కట్టబెట్టడానికే చంద్రబాబు ఈ పథకం వేశారు.
ఇక షెల్ కంపెనీల ద్వారా బాబు బంగ్లాకు నిధులు
ఒప్పందంలో చెబుతున్నట్లుగా సీమెన్స్ కంపెనీ తన వాటా 90 శాతంలో ఒక్కరూపాయి కూడా ఇవ్వకుండానే ఏపీఎస్‌ఎస్‌డీసీ తన వాటా కింద జీఎస్టీ కలిపి డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్ల విడుదలకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై అప్పటి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న సునీత అభ్యంతరం తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా ఏర్పడిన ఏపీఎస్‌ఎస్‌డీసీ తరఫున నిధులు ఎలా మంజూరు చేస్తామని తమ అభ్యంతరాలను పీవీ రమేశ్ తన నోట్ ఫైల్‌లో పొందుపరిచారు.
అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా నిధులు విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమన్నారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదు. ఏపీఎస్‌ఎస్‌డీసీ సీఈవో గంటా సుబ్బారావు చెప్పినట్లుగా నిధులు విడుదల చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావును ఆదేశించారు. దీంతో నోట్ ఫైళ్లలో సీఎం కాలమ్‌లో ‘ఏఐ’ (ఆఫ్టర్ ఇష్యూ) అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోట్ చేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించారని, నిధులు విడుదల చేసిన తర్వాత ఆ ఫైల్‌ను సీఎంకు పంపించాలని పేర్కొన్నారు.

అదే విషయాన్ని పీవీ రమేశ్ ప్రత్యేక కార్యదర్శి సునీతకు తెలియజేశారు. నిధులు విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్లుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తనతో చెప్పారని, గంటా సుబ్బారావు తనను వచ్చి కలిశారని పేర్కొన్నారు. దీంతో నిబంధనలకు విరుద్ధంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ ద్వారా డిజైన్ టెక్ కంపెనీకి రూ.371 కోట్లు మంజూరు చేశారు. ఇందులో సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు రూ.56 కోట్లు చెల్లించారు., మిగతా రూ.315 కోట్లను షెల్ కంపెనీల ద్వారా బోగస్ ఇన్వాయిస్‌లు సమర్పించి వివిధ దశల్లో అక్రమంగా తరలించారు. ప్రతి దశలో షెల్ కంపెనీల సృష్టికర్తలు, దళారుల కమీషన్లు పోనూ చంద్రబాబుకు రూ.241 కోట్లు చేర్చారు.

2018లోనే గుట్టు రట్టు.. ఫైళ్లు మాయం
» ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం 2018లోనే గుట్టు రట్టైంది. కేంద్ర జీఎస్టీ అధికారులు పూణెలోని పలు షెల్ కంపెనీల్లో సోదాలు చేసి భారీగా నకిలీ ఇన్‌వాయిస్‌లను గుర్తించారు. వాటిలో ఏపీఎస్‌ఎస్‌డీసీకి సరఫరా చేసిన నకిలీ ఇన్వాయిస్‌లను గుర్తించడంతో ఏపీ ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. అయితే దీనిపై విచారణ చేయకుండా అప్పటి సీఎం చంద్రబాబు ఏసీబీని అడ్డుకున్నారు. ఆ వెంటనే ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆఫీసులో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫైళ్లను మాయం చేశారు.
» 2019లో పూణెకు చెందిన ఓ సామాజిక కార్యకర్త ఈ కుంభకోణం గురించి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. దీంతో అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సీఐడీ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు అవినీతి బాగోతం అంతా బట్టబయలైంది. ఈ క్రమంలో జర్మనీలోని సీమెన్స్ కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించగా అసలు తమకు ఆ ప్రాజెక్టు గురించే తెలియదని స్పష్టం చేసింది. ఆ వెంటనే సీమెన్స్ కంపెనీ భారత్‌లోని తమ ఎండీ సుమన్ బోస్‌ను ఆ పదవి నుంచి తొలగించింది.
» ఎండీ, డైరెక్టర్ల పేర్లు, హోదాలు ఒప్పంద పత్రాల్లో పరస్పర విరుద్ధంగా ఉన్నాయని ఫోరెన్సిక్ నివేదికలు వెల్లడించడం గమనార్హం. డిజైన్ టెక్, ఇతర షెల్ కంపెనీల ద్వారా సాగించిన కుంభకోణాన్ని కూడా సిట్ అధికారులు ఛేదించారు. ఆ కంపెనీల బ్యాంకు ఖాతాలు, నగదు బదిలీ వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా నిధుల చెల్లింపులో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని నోట్ ఫైళ్ల ద్వారా నిర్ధారించారు.
» ఈ కేసులో కీలక సాక్షులైన ఐవైఆర్ కృష్ణారావు, పీవీ రమేశ్, సునీత తదితరులు చంద్రబాబు ఆదేశాలతోనే నిబంధనలకు విరుద్ధంగా నిధులను విడుదల చేసినట్లుగా వాంగ్మూలం ఇచ్చారు. నిధుల తరలింపులో నారా లోకేశ్ కీలక భూమిక పోషించినట్లు కూడా వెల్లడైంది. దీంతో ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణానికి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబే అన్నది నిర్ధారణ అయింది.
స్కిల్ కుంభకోణంలో బాబు అరెస్టు.. రిమాండ్‌లో 52 రోజులు
» ఈ కేసులో కీలక ఆధారాలు లభించడంతో చంద్రబాబును ఏ–1గా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆయనపై ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఏ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37లతోపాటు అవినీతి నిరోధక చట్టం సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1) (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేశారు.
» అప్పటి ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతోపాటు మరో 38 మందిని నిందితులుగా పేర్కొంది. 2023 సెపె్టంబరు 9న సిట్ చంద్రబాబును అరెస్టు చేసింది. ఆయన అవినీతికి ఆధారాలున్నాయన్న సిట్ వాదనతో ఏసీబీ న్యాయస్థానం ఏకీభవించింది. అందుకే చంద్రబాబును రిమాండ్‌కు పంపింది. ఈ కేసులో చంద్రబాబు 52 రోజులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదల అయ్యారు.
ఆ ముగ్గురే కీలకం..
» 2014–19లో రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయ పన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసింది. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించింది.
» చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి అయిన మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణం నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. ఆ వెంటనే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ విదేశాలకు పరారవ్వడం గమనార్హం. 2024లో బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పెండ్యాల శ్రీనివాస్ రాష్ట్రానికి తిరిగి వచ్చారు.
బాబు అవినీతిపై ఈడీ కొరడా
» ఏపీఎస్‌ఎస్‌డీసీ కుంభకోణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా దర్యాప్తు చేపట్టడం గమనార్హం. షెల్ కంపెనీల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించిన ముడుపులు.. ఏఏ బ్యాంకు ఖాతాల నుంచి సింగపూర్‌కు వెళ్లాయి.. అక్కడి నుంచి దేశంలోని ఏ ఖాతాలకు తిరిగి వచ్చాయన్న విషయాన్ని గుర్తించింది.
» డిజైన్ టెక్‌కు చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది. చంద్రబాబుకు సన్నిహితులు, ఆ కుంభకోణంతో ప్రమేయమున్న షెల్ కంపెనీల ప్రతినిధులు మొత్తం 26 మందికి నోటీసులు జారీ చేసి పలువురిని విచారించింది. సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ (సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ), వికాస్ ఖన్విల్కర్ (డిజైన్ టెక్ కంపెనీ ఎండీ), ముకుల్ చంద్ర అగర్వాల్ (స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి), సురేశ్ గోయల్ (చార్టెర్డ్ అకౌంటెంట్)లను అరెస్టు చేసింది.
బాబు అవినీతిని కడిగిపారేసిన కాగ్
» రాజ్యాంగబద్ధ సంస్థ కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) కూడా చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే విడుదల చేయాలి.
» అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి, ప్రభుత్వ వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులను విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం వాటిల్లిందని కాగ్ తెలిపింది.