ఏపీయూఐఏఎంఎల్‌లో టీడీపీ సానుభూతిపరులైన నలుగురు ఉద్యోగుల ఇష్టారాజ్యం
ఆ నలుగురికీ ఐఏఎస్‌ల కంటే అధిక వేతనాలు
టీడీపీ సానుభూతిపరులైతే అర్హత లేకున్నా.. పనితీరు సక్రమంగా లేకున్నా పదోన్నతులు, వేతనాలు పెంపు
ఈ అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే సస్పెన్షన్ వేటు తప్పదు
సాక్షి, అమరావతి: ప్రభుత్వరంగ సంస్థలో ఉద్యోగులైనా.. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటైన సంస్థ ఉద్యోగులైనా పదోన్నతి కల్పించడానికి, వేతనాలు పెంచడానికి వారి అర్హత, పనితీరే కొలమానం. కానీ ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అస్సెట్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(ఏపీయూఐఏఎంఎల్)లో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తోంది. అధికార పార్టీకి సానుభూతిపరులైతే చాలు.. అర్హత లేకున్నా పనితీరు తీసికట్టుగా ఉన్నా.. ప్రతిభ లేకపోయినాసరే పదోన్నతి ఇచ్చేస్తున్నారు. వేతనాలు భారీగా పెంచేస్తున్నారు.
అర్హత ఉండి.. మెరుగైన పనితీరు కనబరుస్తూ.. లక్ష్యాల సాధనలో ప్రతిభ చాటుతున్న ఉద్యోగులకు పదోన్నతి, వేతనాలు పెంచడానికి ముడుపులు వసూలు చేస్తున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై సీఈవో, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి సస్పెండ్ చేయిస్తున్నారు. పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధింపులకు గురిచేస్తున్నారని బాధిత ఉద్యోగులు వాపోతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాల్టిల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు పెట్టుబడులను ఆకర్షించడం.. వాటిని నిర్వహించడమే లక్ష్యంగా 2016లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏపీయూఐఏఎంఎల్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ సంస్థలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 49 శాతం కాగా.. ఐఎల్‌అండ్ ఎఫ్‌ఎస్ వాటా 51 శాతం.
నష్టాలు వచ్చిన విభాగాల్లో పదోన్నతులు, వేతనాల పెంపు
రాష్ట్రంలో 8 విభాగాల్లో ఏపీయూఐఏఎంఎల్ సేవలందిస్తోంది. 243 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే సంస్థలో కొత్త పదవి సృష్టించి.. అందులో టీడీపీ సానుభూతిపరుడిని నియమించారు. నెలకు వేతనం రూ.3,94,240 చెల్లిస్తున్నారు. ఐఏఎస్ అధికారికి కూడా ఈ స్థాయి వేతనం ఉండదు. దీంతోపాటు టీడీపీ సానుభూతిపరులైన ముగ్గురు ఉద్యోగులకు సీఈవో కార్యాలయం, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. వారికి వరుసగా నెలకు రూ.2,46,400, రూ.1.90 లక్షలు, రూ.1.75 లక్షల చొప్పున వేతనం చెల్లిస్తున్నారు.
ఈ నలుగురు కలిసి ఉద్యోగులు టీడీపీ సానుభూతిపరులైతే అర్హత లేకున్నా.. పనితీరు సక్రమంగా లేకున్నా పదోన్నతి కల్పించి, వేతనాలు పెంచేలా చక్రం తిప్పుతున్నారు. ఎకనమిక్ డెవలప్‌మెంట్ (ఈడీ), అర్బన్ ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్ (యూఐడీ), పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) విభాగాల్లో మాత్రమే ఈ సంస్థలకు లాభాలు వస్తున్నాయి. మిగతా 5 విభాగాల్లోనూ నష్టాలే. 2025–26లో ఈ సంస్థకు రూ.19.99 కోట్ల ఆదా యం వస్తే.. ఖర్చులు రూ.12.48 కోట్లు పోగా రూ.7.51 కోట్లు లాభాలు వచ్చాయి.
ఈడీ విభాగంలో రూ.7.81 కోట్ల లాభం రాగా.. యూఐడీలో రూ.1.29 కోట్లు, పీపీపీ విభాగంలో రూ.61.65 లక్షల లాభాలు వచ్చాయి. ఇందులో తక్కువ లాభం వచ్చిన పీపీపీ విభాగంలో ఓ ఉద్యోగికి వేతనాలు పెంచి నెలకు రూ.4,63,050 చొప్పున ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరుడనే ఏకైక కారణంతో ఇటీవల బీడీడీ విభాగంలో ఓ ఉద్యోగిని తీసుకుని నెలకు రూ.3,85,714 చొప్పున వేతనం ఇస్తున్నారు. టీడీపీ సానుభూతిపరులైన ఉద్యోగులకు లేదా ముడుపులు ఇచ్చిన వారికి నెలకు గరిష్టంగా రూ.4.63 లక్షల నుంచి కనిష్టంగా రూ.1.42 లక్షల చొప్పున వేతనాలు ఇస్తున్నారు.
అన్యాయాన్ని ప్రశ్నిస్తే సస్పెన్షన్ నజరానా
తమకు అప్పగించిన విభాగాల్లో మెరుగైన పనితీరు కనబరిచి.. తమ ప్రతిభ ఆధారంగా లాభాలు తెచ్చిన ఉద్యోగులకు పదోన్నతి కల్పించకుండా, వేతనాలు పెంచకుండా వేధిస్తున్నారని వాపోతున్నారు. ఏమిటీ అన్యాయమని ఎవరైనా ప్రశ్నిస్తే... సీఈవోకు, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శికి తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుదోవ పట్టించి వారిపై సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. లేదంటే మెమోలు ఇప్పించి వేధిస్తున్నారు. కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న షేక్ అజీమ్ అహ్మద్‌పై ఇదే రీతిలో ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి సస్పెన్షన్ వేటు వేయించారని ఉద్యోగులు తెలిపారు.
తమ మాట వినకుండా ముడుపులు ఇవ్వడానికి నిరాకరించిన ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వకుండా, వేతనాలు పెంచకుండా ఆ నలుగురూ మోకాలడ్డుతున్నారని ఆ సంస్థ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థ, గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. కానీ.. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ అయిన ఏపీయూఐఏఎంఎల్ సిబ్బందికి మాత్రం ప్రభుత్వ నిధులతో ప్రతినెలా ఠంఛనుగా జీతాలు ఇస్తుండటం గమనార్హం.


