‘ఉపాధి’ పనుల నిలిపివేత | Suspension of Employment Guarantee Works: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ పనుల నిలిపివేత

Apr 15 2026 6:14 AM | Updated on Apr 15 2026 6:14 AM

Suspension of Employment Guarantee Works: Andhra Pradesh

పనులు ఆపేయడంతో నిరుత్సాహంగా ఉపాధి కూలీలు

టీడీపీ నేత ఆదేశాలు అమలు చేసిన సిబ్బంది  

వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలంలో దురాగతం

సాక్షి టాస్క్ ఫోర్స్‌: వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట మండలం శివారు ప్రాంతమైన కల్లూరుపల్లె గ్రామం దిద్దుకుంట వాండ్లపల్లెలో టీడీపీ నేత ఆదేశాలతో ఉపాధి హామీ పనులు నిలిపివేయడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిద్దుకుంట వాండ్లపల్లెలో సుమారు 50 కుటుంబాల వారు ఎప్పటిలాగే మంగళవారం ఉదయం ఉపాధి పనులకు వెళ్లారు. ఆ సమయానికి అక్కడికి చేరుకున్న టెక్నికల్‌ అసిస్టెంట్‌ ‘మీకు పనులు లేవు... ఇళ్లకు వెళ్లిపోండని’ ఆదేశించారు.

ఇదేమని అడిగితే  ‘పనులు పెట్టొద్దన్నారు... అందుకే మీకు పనులు పెట్టేది లేదు’ అని తేల్చి చెప్పాడు. దీంతో గ్రామస్తులంతా ఏకమై వాదనకు దిగి... నిన్న పనులు ప్రారంభించి ఈ రోజు లేవంటే ఎలా అని నిలదీయడంతో... టీడీపీ నేత ఆదేశాలతోనే పనులు నిలిపేశామని టెక్నికల్‌ అసిస్టెంట్‌ బదులిచ్చాడు. దీంతో కోపోద్రిక్తులైన గ్రామస్తులు తమకు పనులు కల్పించకపోతే ఎంత దూరమైనా వెళ్తామని... ఎవ్వరినీ వదలమని తేల్చిచెప్పారు. అధికారులు స్పందించి వెంటనే ఉపాధి పనులు కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు.  

వైఎస్సార్‌సీపీ అభిమానులు కావడంతో... 
దిద్దుకుంట వాండ్లపల్లెలో నాలుగైదు ఇళ్లు మినహా మిగిలిన వారంతా వైఎస్సార్‌సీపీ అభిమానులు కావడంతో పచ్చ నేతకు కంటగింపుగా మారింది. ఎలాగైనా అక్కసు తీర్చుకోవాలని అనుకున్నదే తడవుగా అధికార బలాన్ని ప్రదర్శించి... ఆ ఊర్లో ఉపాధి పనులు నిలిపేయాలని అధికారులకు హుకుం జారీ చేశాడు. పచ్చ చొక్కాలు తొడుక్కున్న అధికారులు వెంటనే సదరు టీడీపీ నేత ఆదేశాలను అమలు చేశారు. అయితే ఊరి జనమంతా ఏకమై ఉపాధి సిబ్బందిపై ఎదురుతిరగడంతోపాటు... ‘ఈ ఊర్లోనే ఉపాధి పనులు ఎందుకు పెట్టరు’ అని నిలదీయడంతో సిబ్బంది కంగుతిన్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.

Advertisement
 
Advertisement
Advertisement