కృష్ణా జలాలపై కౌంటర్‌ వేయండి

Supreme court command to AP Telangana and Maharashtra in Karnataka Petition - Sakshi

కర్ణాటక పిటిషన్‌పై ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు సుప్రీం ఆదేశం 

సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపకానికి సంబంధించి కర్ణాటక సర్కార్‌ దాఖలు చేసిన ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్‌(ఐఏ)పై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలమట్టి డ్యాం ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచేందుకు కృష్ణా ట్రిబ్యునల్‌–2 అనుమతివ్వడాన్ని సవాల్‌ చేస్తూ గతంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌కు సంబంధించి జస్టిస్‌ బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన అవార్డును కేంద్రం అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన ఐఏను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది.

కర్ణాటక ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ వాదనలు వినిపించారు. అవార్డును నోటిఫై చేయకపోవడం వల్ల కర్ణాటక వాటా జలాలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయని చెప్పారు. జస్టిస్‌ బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు మేరకు రాష్ట్రంలో రూ.13 వేల కోట్లతో కాలువలు తవ్వించామని తెలిపారు. ట్రిబ్యునల్‌ అవార్డును అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరారు. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి వాదిస్తూ.. ఏపీ ప్రయోజనాలను వివరించారు. కర్ణాటక దాఖలు చేసిన ఐఏకి తదుపరి విచారణలోపు కౌంటరు దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మహారాష్ట్ర దాఖలు చేసిన ఐఏను జత చేస్తున్నామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top