మండే కాలం 

Sun Temperature Reported 35 To 42 Degrees Celsius In Andhra Pradesh - Sakshi

రోజురోజుకూ అధికమవుతున్న ఎండల తీవ్రత  

ఎండ బారినపడితే వడదెబ్బ, చర్మ వ్యాధులకు గురయ్యే అవకాశం 

ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యుల సూచన 

బయటకు వచ్చేందుకు భయపడుతున్న ప్రజలు 

సీతంపేట: ఎండలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. దీంతో రోజువారీ నమోదయ్యే ఉష్ణోగ్రతల్లో భారీగా తేడా కనిపిస్తోంది. సగటు ఉష్ణోగ్రత 35 నుంచి 42 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుండడంతో బయటకు వెళ్లాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండడంతో వాతావరణం వేడెక్కిపోతోంది. సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి ఉండడంతో ప్రజలు ఉక్కపోతతో బాధపడుతున్నారు.

మరికొంతమంది అస్వస్థతకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకుని ప్రాణపాయం లేకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా ఎండల్లో తిరిగితే సన్‌(హీట్‌) స్ట్రోక్‌ (వడదెబ్బ), హీట్‌ సింకోప్‌(తల తిరగడం), హీట్‌ ఎక్సాషన్‌( అలసట), హీట్‌ క్రాంప్స్‌(కండరాలు, పిక్కలు లాగడం)తో పాటు పలు చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 

వడదెబ్బ ప్రమాదకరం.. 
ప్రజలు వేసవిలో ఎక్కువగా వడదెబ్బ బారిన పడతా రు. ఇది చాలా ప్రమాదకరం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఎండలో ఎక్కువసేపు తిరిగి, తగినంత లవణాలున్న నీరు తీసుకోకపోతే అపస్మారక స్థితికి చేరుతారు. తీవ్ర జ్వరం, మూత్రం రాకపోవ డం వంటి లక్షణాలు కనిపిస్తే వడదెబ్బకు గురైనట్లు తొలుత గుర్తించాలి. కొందరిలో ఫిట్స్‌ లక్షణాలు కూడా కనిపిస్తుండడం గమనార్హం.

పార్కిన్‌సన్‌(తల ఊపడం) వ్యాధికి సంబంధించి మందులు వాడే వా రు త్వరగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. బయట ఆహారం తీసుకోవడం ద్వారా డయేరియా సోకే అవకాశం ఉంది. శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం వల్ల కిడ్నీలపై కూడా ప్రభావం పడుతుంది. శరీరమంతా యాసిడ్‌ ఏర్పడి అవయవాలపై ప్రభా వం చూపుతాయి. అధిక వేడిమితో చమట కాయలు రావడం, గడ్డలు కట్టడం, సన్‌బర్న్‌ (చర్మం కమిలిపోవడం) వంటి సమస్యలు వస్తాయి. శరీరంపై దద్దుర్లు సైతం ఏర్పడతాయి. 

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి.. 
ఎండ కారణంగా స్పృహ కోల్పోయి పడిపోయిన వ్యక్తులకు చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్‌ లేక కూలర్‌ ముందు సేదతీరేలా చేయాలి. తడిగుడ్డతో శరీరం తుడవాలి. తర్వాత దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ఐవీ ప్లూయిడ్స్‌ ఇవ్వడంతో పాటు ఓఆర్‌ఎస్‌ ద్రావణం తాగించాలి. దీని ద్వారా మనిషి ప్రాణాపా య స్థితి నుంచి గట్టెక్కుతాడు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. 
♦సాధ్యమైనంత వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. 
♦ఎటువంటి కార్యక్రమాలనైనా ఎండ తక్కువగా ఉన్న సమయాల్లో చేసుకోవాలి. 
♦కాటన్, వదులుగా ఉండే దుస్తులు ధరించాలి.  
♦జీన్స్, బ్లాక్‌ షర్టులు వేసుకోకపోవడం మంచిది. 
♦బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగును వెంట తీసుకెళ్లాలి.  
♦శరీరానికి ఎండ తగలకుండా దుస్తులు ధరించాలి. 
♦సన్‌స్క్రీన్‌ లోషన్‌లు వాడడం మంచిది. 
♦తరచుగా నీరు, లవణాలు తీసుకోవాలి. 
♦నీటితో పాటు కొబ్బరి బొండాలు, కాయగూరలు, పండ్లు తీసుకోవాలి. 
♦కూల్‌ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.  
♦రోడ్లపై విక్రయించే, వేపుడు పదార్థాలకు దూరంగా ఉండాలి.  
♦ఆయిల్‌ ఫుడ్, టీ, కాఫీ వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. 

అప్రమత్తంగా ఉండాలి.. 
వేసవిలో అప్రమత్తంగా ఉండాలి. ఎండల్లో తిరగకూడ దు. ఎండలోకి వెళ్లినప్పుడు తప్పనిసరిగా గొడుగు వేసుకోవాలి. వాటర్‌ బాటిల్‌ వెంట తీసుకువెళ్లాలి. మజ్జిగ, కొబ్బరినీళ్లు వంటివి తీసుకోవాలి. కాటన్‌ దుస్తులు ధరించడం చాలా మంచిది.  
–బి. శ్రీనివాసరావు, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ, సీతంపేట, ఐటీడీఏ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top