
రాజమహేంద్రవరంలో విద్యార్థులను లాగిపడేస్తున్న పోలీసులు
రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద విద్యార్థుల ధర్నాలు
రాజమహేంద్రవరంలో పోలీసుల లాఠీచార్జి
సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం
రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన
కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో రాజమహేంద్ర
వరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు
జులుం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ
ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం/ఏలూరు (టూటౌన్)/శ్రీకాకుళం పాత బస్టాండ్ : సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టరేట్‌ల వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని, ఆంక్షలు లేకుండా తల్లికి వందనం అందించాలని, హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వద్ద ధర్నాకు వచ్చిన విద్యార్థులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. నిరసనకు అనుమతి లేదంటూ ఒక్కసారిగా విద్యార్థులపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
అక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరింపులకు దిగారు. దొరికినవారిని దొరికినట్లు రోడ్డు పక్కకు ఈడ్చిపారేశారు. లాఠీలతో కొట్టారు. కొందరిని గొంతు పట్టుకుని తోసేయడంతో ఓ విద్యార్థి రోడ్డు పక్కన పడిపోయాడు. పోలీసుల దౌర్జన్యంతో పలువురు విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులకు గాయాలయ్యాయి. సహనం నశించిన విద్యార్థులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కలెక్టరేట్ ఎదుట సుమారు నాలుగు గంటలపాటు బైఠాయించారు.
చివరకు డీఆర్వో సీతారామయ్య కలెక్టరేట్ బయట గేటు వద్దకు చేరుకుని వినతి పత్రం స్వీకరించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఏలూరు కలెక్టరేట్ వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించి.. కలెక్టర్ వెట్రిసెల్వికి వినతి పత్రం ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర శాఖ సోమవారం విమర్శించింది.