ఉన్నత చదువులు చదువుకుంటున్న సామాన్యులు

Srikakulam District: Jagananna Vidya Deevena, Jagananna Vasathi Deevena - Sakshi

అండగా నిలుస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు

శ్రీకాకుళం జిల్లాలో ఏటా 69వేల మంది విద్యార్థులకు ప్రయోజనం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: సామాన్యుడికి ఉన్నత చదువు చేరువవుతోంది. బుర్ర నిండా తెలివితేటలు ఉన్నా జేబు నిండా డబ్బు లేకపోవడంతో నిన్నటి తరంలో చాలా మంది ఉన్నత చదువులకు దూరమయ్యారు. కుటుంబ ఆర్థిక స్థితిగతుల మూలాన ఇష్టం లేని కొలువులు, వ్యాపారాలు, చిరుద్యోగాల్లో చేరి సర్దుకుపోయారు. కానీ నేటి తరానికి ఓ ఊతం దొరికింది. ‘నువ్వు చదువుకో.. నేను ఫీజు కడతా’ అంటూ భరోసా ఇచ్చే నాయకుడు దొరికాడు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లోని పిల్లలకు జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో వైఎస్‌ జగన్‌ సర్కారు కొండంత అండగా నిలుస్తోంది. ఈ సాయంతో చాలా మంది పిల్లలు ఉన్నత చదువులు చదవాలనే తమ కలలను నెరవేర్చుకుంటున్నారు.  

పేదల బతుకుల్లో వెలుగులు 
జగన్న విద్యా వసతి, విద్యాదీవెన పథకంతో జిల్లాలో పేదల విద్య సాగుతోంది. ఈ పథకం బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, తదితర కులాలకు చెందిన పేద పిల్లలకు అమలవుతోంది. 2020–21లో రెండు విడతల్లో 64,623 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 62.33 కోట్లు విడుదల చేశారు. అలాగే జగనన్న విద్యాదీవెన పథకం కింద 67,940 మంది విద్యార్థులకు గాను రూ.67.27 కోట్లు విడుదల చేశారు. 2021–22 సంవత్సరానికి గాను మూడు విడతల్లో 54,764 మంది విద్యార్థులకు జగనన్న వసతి దీవెన కింద రూ.81.61 కోట్లు అందించారు. 

జగనన్న విద్యాదీవెన కింద 68,913 మంది విద్యార్థులకు రూ.63.52 కోట్లను అందజేశారు. ఈ ఏడాది ఇంకా కొన్ని విభాగాల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అర్హులందరికీ జ్ఞాన భూమి పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. జగనన్న వసతి, విద్యా దీవెన పథకాలు డబ్బులు నేరుగా విద్యార్థి తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. విద్యా దీవెన పథకంలో నిర్ణయించిన ఫీజులు చెల్లించగా, వసతి దీవెన పథకం కింద ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నికల్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ ఆపై తరగతులు చదువుతున్న వారికి రూ.20 వేలు చెల్లిస్తున్నారు.   


రుణపడి ఉంటాం..  

నా పేరు పొదిలాపు పార్వతి. నాది శ్రీకాకుళం మండలం లంకాం గ్రామం. నా భర్త పదేళ్ల కిందటే కాలం చేశారు. నాకు ఇద్దరు ఆడపిల్లలు. చిన్న పిల్ల దీపిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. పెద్ద పిల్ల గీతిక విశాఖపట్నంలో ఇంజినీరింగ్‌ చేస్తోంది. మా ఇద్దరు పిల్లలను జగనన్నే చదివిస్తున్నారు. చిన్నపిల్లకు అమ్మ ఒడి వస్తుంది. పెద్ద పిల్లకు విద్యాదీవెన, వసతి దీవెన వస్తుంది. కాలేజీ ఫీజులకు, చదువు పుస్తకాలకు ఖర్చులకు ప్రభుత్వం సాయం మాకు ఎంతో మేలు చేస్తోంది. నేను నా పిల్లలు జగనన్నకు రుణపడి ఉంటాం. 


నా లాంటి వారికి మేలు 

నా పేరు పైడి మాధవరావు. మాది శ్రీకాకుళం మండలం వాకలవలస గ్రామం. మాకు స్థిర చరాస్తులు లేవు. కష్టపడి జీవ నం సాగిస్తున్నాం. నేను ఒక ప్రైవేటు వ్యాపారి వద్ద రోజు కూలీగా పనిచేస్తున్నా. నాకు ఇద్దరు కవల పిల్లలు. ఇద్దరూ ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. నిజానికి వీరిని పెద్ద చదువులు చదివించే స్థోమత మాకు లేదు. ఇంటర్‌ చదివేటప్పుడు మా పిల్లలకు అమ్మ ఒడి వచ్చింది. ప్రస్తుతం ఇద్దరినీ విజయనగరంలోని లెండి ఇంజినీరింగ్‌ కళాశాలలో చేర్పించా. కేవలం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన వస్తుందన్న ధైర్యంతోనే వారి చదువులు సాగుతున్నాయి. కళాశాల ఫీజులు, పిల్లల చదువు ఖర్చులు జగనన్న ఇస్తున్నారు. నాలాంటి వారికి ఈ పథకం ఎంతో ఉపయోగ పడుతోంది. (క్లిక్ చేయండి: ప్రభుత్వ బడుల్లో సీబీఎస్‌ఈ పాఠాలు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top