పారిశ్రామిక నగరాల సరసన.. మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు

spsr nellore district AP Government Industries Ramayapatnam Port  - Sakshi

మూడేళ్లలో క్రిస్‌ సిటీ సిద్ధం 

వేగంగా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు

ఎయిర్‌పోర్టు నిర్మాణానికి స్థల పరిశీలన

మిథానీ, క్రిబ్‌కో పరిశ్రమల ఏర్పాటు వేగవంతం 

నూతన, అనుబంధ పరిశ్రమల ద్వారా భారీ పెట్టుబడులు 

పెద్దసంఖ్యలో ఉద్యోగాల కల్పన 

సాక్షి, నెల్లూరు: ఎందరో నాయకులు, మేధావులు, పారిశ్రామికవేత్తలు, కళాకారుల జన్మస్థలమైన ఉమ్మడి నెల్లూరు జిల్లా.. భవిష్యత్‌లో పెద్ద పారిశ్రామిక నగరాల సరసన చేరేందుకు శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తద్వారా భారీగా పెట్టుబడులు రావడంతోపాటు స్థానికులకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై అత్యంత కీలకమైన ప్రాంతంలో ఉన్న జిల్లా గతంలోనే ఎన్నో పరిశ్రమలకు నిలయంగా ఉండేది. ఇప్పటికే అభివృద్ధి చెందిన నాయుడుపేట, గూడూరు, తడ తదితరాలతోపాటు రామాయపట్నం పోర్టు జిల్లాకు అందివచ్చిన అవకాశంగా నిలిచింది. ఈ ప్రాంతాన్ని పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా మార్చేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ఏర్పాటు చేసిన పారిశ్రామికవాడల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. తాజాగా క్రిస్‌ సిటీకి గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేస్తున్నారు.  

రాబోయే మూడేళ్లలో.. 
చెన్నై– విశాఖ పారిశ్రామిక కారిడార్‌ అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. గూడూరు నియోజకవర్గంలోని కోట, చిల్లకూరు మండలాల్లోని తీర ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం ద్వారా వేలమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. నేషనల్‌ ఇండ్రస్టియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (నిబ్బిక్‌), రాష్ట్ర పభుత్వ పరిధిలో ఉన్న ఏపీఐఐసీ సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ సకల సదుపాయాలు సమకూర్చి పరిశ్రమలకు కేటాయిస్తారు. రానున్న మూడేళ్లలో సరికొత్త పారిశ్రామిక నగరం క్రిస్‌ సిటీ అందుబాటులోకి రానుంది.

అందులో రూ.37,500 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఇంజినీరింగ్, ఎంఎస్‌ఎంఈ రంగాల పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో ఇప్పటికే 2,500 ఎకరాలకు గానూ 2,091 ఎకరాల భూసేకరణ చేశారు. 36 నెలల కాలవ్యవధిలో మౌలిక వసతులు కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 50 వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయి. అందుకోసం 2022 మే 10వ తేదీన పర్యావరణ అనుమతులు లభించాయి. కండలేరు ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా అనుమతులు సైతం పూర్తయ్యాయి.  

►కొడవలూరు మండలం  బొడ్డువారిపాళెంలో నాల్కో–మిథానీ సంయుక్త సంస్థ ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్‌ ఆధ్వర్యంలో అల్యూ మినియం పరిశ్రమ  110 ఎకరాల్లో  ఏర్పాటు కానుంది. అందుకు రూ.6 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు. ఇప్పటికే భూ సేకరణకు అడ్డంకులు తొలగిపోయాయి.  ఇది ఏర్పాటైతే 2 వేల మందికి ప్రత్యక్షంగా, మరో పదివేల మందికి పరోక్షంగా  ఉపాధి ఉంటుంది.  
►సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం క్రిబ్‌కో ఎరువుల కర్మాగారాన్ని 290 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నారు. రూ.2 వేల కోట్లతో నెలకొల్పి రెండువేల మందికి ఉపాధి కల్పించనున్నారు.

శరవేగంగా రామాయపట్నం పోర్టు పనులు 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రస్తుతం జెట్‌స్పీడ్‌తో సాగుతున్నాయి. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రావూరు పంచాయతీ పరిధిలోని మొండివారిపాళెం, ఆవులవారిపాళెం, సాలిపేట పంచాయతీ పరిధిలోని కర్లపాళెం గ్రామాల పరిధిలో ఉన్న సముద్ర తీర ప్రాంతం వద్ద పోర్టు నిర్మాణానికి 850 ఎకరాల భూములను సేకరించి కేటాయించారు. రూ.3,736 కోట్ల ఖర్చుతో చేపట్టిన మొదటిదశలో నాలుగు బెర్తుల నిర్మిస్తారు. ప్రస్తుతం నార్త్, సౌత్‌ బ్రేక్‌వాటర్‌ ఫీడర్‌ల నిర్మాణ పనులతోపాటు, బెర్తు నిర్మాణ ప్రాంతంలో సముద్ర లోతును పెంచే డ్రెజ్జింగ్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. మొత్తం నాలుగు బెర్తులు నిర్మించి 25 మిలియన్‌ టన్నుల కార్గో రవాణా చేయాలన్న లక్ష్యంతో మొదటిదశ పనులు చేపట్టారు. అనంతర క్రమంలో దీన్ని పది బెర్తులకు పెంచాలనే ప్రతిపాదన ఉంది. మొదటి దశ పనులు పూర్తయితే 3 నుంచి 4 వేలమందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

పోర్టు నిర్మాణంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా పెద్దఎత్తున అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం తెట్టు వద్ద రైల్వేస్టేషన్‌ ఉండడంతోపాటు, చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారి పోర్టు సమీపం నుంచే వెళ్తుంది. పోర్టుకు అనుబంధంగా తెట్టు వద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ప్రతిపాదించారు. దీనికి గానూ జాతీయ రహదారిపై ఉన్న తెట్టు జంక్షన్‌ నుంచి గుడ్లూరు వైపు వెళ్లే మార్గంలో తెట్టు–శాంతినగర్‌ మధ్యలో 2,024 ఎకరాల భూములను పరిశీలిస్తున్నారు. మరోవైపు గుడ్లూరు మండలంలోని రావూరు, చేవూరు గ్రామాల పరిధిలో ఇండోసోల్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.50 వేల కోట్ల పెట్టుబడితో సోలార్‌ మాడ్యూల్స్‌ తయారీ పరిశ్రమను ఇక్కడ నెలకొల్పనున్నారు. 

మూడేళ్లలో 13 భారీ పరిశ్రమలు 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మరింతగా ప్రోత్సాహం అందించారు. పరిశ్రమల శాఖామంత్రిగా దివంగత మేకపాటి గౌతమ్‌రెడ్డి చొరవతో గత మూడేళ్లలోనే 13 భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. రూ.1,806.72  కోట్లతో ఏర్పాటైన వీటిలో సుమారు 1,780 మంది ఉపాధి పొందుతున్నారు. ఇంకా 2,568 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు రూ.1,785.54 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటై 18,031 మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.  

జిల్లాలో అపార అవకాశాలు
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అపార అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఎందరో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. గత మూడేళ్లలోనే మెగా, భారీ ప్రాజెక్టు లు ఏర్పాటు చేసి వేలాదిమందికి  ఉపాధి కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిథానీ, క్రిబ్‌కో వంటి భారీ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. పోర్టుల పరిధిలో పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేసి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశాలు కల్పిస్తున్నాం. 
– జి.ప్రసాద్, పరిశ్రమల శాఖ జీఎం, నెల్లూరు

వైఎస్సార్‌ హయాంలోనే శ్రీకారం 
ఆసియాలోని అతి పెద్దదైన కృష్ణపట్నం ఓడరేవును 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రారంభించారు. 14 బెర్తులతో ఏర్పాటైన ఈ పోర్టు 2014–15లోనే రూ.1,800 కోట్ల వార్షికాదాయం ఆర్జించింది. ఆ పోర్టుకు అనుబంధంగా ఏడు పామాయిల్‌ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. బొగ్గు దిగుమతి అవకాశాలు మెరుగవడంతో ఏపీ జెన్‌కో పవర్‌ ప్లాంట్లను రెండు దశలుగా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా సుమారు 2,400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుకు అవకాశం రావటంతో తడ మండలం మాంబట్టు, ఉమ్మడి నెల్లూరు, తిరుపతి జిల్లాల మధ్య శ్రీసిటీ, నాయుడుపేట వద్ద మేనకూరు సెజ్‌లను అప్పట్లోనే ఏర్పాటు చేశారు. శ్రీసిటీలో 300 పరిశ్రమలు ఏర్పాటు చేయగా, ప్రస్తుతం సుమారు లక్షమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో లక్షమందికి పైగా ఉపాధి పొందుతున్నారు. మాంబట్టు సెజ్‌లో 20 పరిశ్రమల వరకు ఏర్పాటు చేయగా పదివేల మంది ప్రత్యక్షంగా, మరో 15 వేల మంది పరోక్షంగా, మేనకూరు సెజ్‌లో 29 పరిశ్రమలు ఏర్పాటుకాగా దాదాపు 15 వేల మంది ప్రత్యక్షంగా, 10 వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top